రాజ‌కీయ‌నాయ‌కులంతా న‌న్ను చూసి నేర్చుకోవాలి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Friday, January 11th, 2019, 10:50:34 AM IST

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి స్వర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావును ప్ర‌స్తావిస్తూ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా కడప జిల్లాలో జ‌న‌సేన‌ నాయకులతో ఏర్పాటు చేసిన‌ సమీక్షలో మాట్లాడిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. నాడు ఎన్టీఆర్ గారు మెదక్‌లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుందని వ్యాఖ్య‌లు చేశార‌ని, తీరా చూస్తే ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు పరాజయం పాలయ్యారని చెప్పారు. అయితే తన వెనుక లక్షలాది మంది జనసైనికులు ఉన్నారని, ధవళేశ్వరం అయినా, అనంతపురంలో అయినా లక్షలాది మంది అభిమానులు వచ్చారని, అంత మాత్రాన నేనే గొప్ప‌ని భావిస్తూ పొగ‌రును త‌ల‌కు ఎక్కించుకోనని ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేశారు.

ఇక తాను ప్ర‌జ‌ల‌ను న‌మ్మే రాజ‌కీయాల్లోకి పార్టీ పెట్టాన‌ని, జ‌న‌సేన సాధార‌ణ పార్టీ కాద‌ని, ఒక బ‌ల‌మైన జ‌నస‌మూహం ఉన్న పార్టీ అని ప‌వ‌న్ అన్నారు. ముందు అనేక దెబ్బ‌లు త‌గులుతాయ‌ని, అయితే వాటిని త‌ట్టుకుని నిల‌బ‌డాల‌ని, ఒక బోరు వేస్తే ముందుగా మ‌ట్టి. రాళ్ళు, వ‌స్తాయ‌ని, అంత మాత్రానికి బోరు వేయ‌డం ఆపేస్తే నీళ్లు ఎలా వ‌స్తాయ‌ని ప‌వ‌న్ అన్నారు. ఇక త‌మ పార్టీని చూసి, టీడీపీ, వైసీపీలు భ‌య‌ప‌డుతున్నాయ‌ని, అందుకే త‌మ‌ని ఏం చేయ‌లేక వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ప‌వ‌న్ అన్నారు. రాజ‌కీయ నాయ‌కులంతా త‌న‌ని అనుకరించాల‌ని,ఇతరులు తనను వ్యక్తిగతంగా తిడితే ఎలా భరిస్తున్నానో చూసి నేర్చుకోవాల‌ని, తెలంగాణ ఉధ్యమం సమయంలో తనను కూడా కొట్టేందుకు వచ్చారని, అయితే వారికి పరిస్థితులు వివరించాక వారు అర్థం చేసుకుని వెళిపోయార‌ని చెప్పారు. త‌న శత్రువులు కూడా గొడవ పెట్టుకోకుండా వాస్తవాలు అర్థమయ్యేలా చెప్పే శక్తి తనకు ఉందని ప‌వ‌న్ అన్నారు.