జనసైనికుల్లో మునుపటి జోష్ మిస్సయ్యిందా..? – పవన్ స్ట్రాటజీయే కారణమా..?

Saturday, March 16th, 2019, 10:46:22 AM IST

ఏపీ, తెలంగాణాల్లో ఒకేసారి ఎన్నికలు జరగనుండటంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఆకాశాన్నంటుతుంది, పార్టీలన్నీ తమ వ్యూహం ప్రకారం పావులు కదుపుతూ ప్రచారానికి తొలి అడుగులు వేస్తున్నాయి. ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య గట్టి పోరు నడుస్తుండగా, రేసులోకి కొత్తగా వచ్చిన జనసేన కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారే దిశగా అడుగులేస్తోంది. అయితే ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగాన్ని గనక గమనిస్తే, ఆయన వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మొన్నటిదాకా చంద్రబాబు, లోకేష్ లపై కూడా విమర్శనాస్త్రాలు సంధించిన పవన్, ఆవిర్భావ సభలో మాత్రం జగనే తన ప్రధాన టార్గెట్ అన్నట్టు ప్రసంగం ఆద్యంతం జగన్ ను ఏకి పారేయటంతోనే సరిపెట్టాడు. ఇక్కడే జనసేన, టీడీపీల రహస్య స్నేహంపై అనుమానాలు కలుగుతున్నాయి, గతంలో వైసీపీ, టీడీపీలపై ఒంటికాలు మీద లేచిన పవన్ ఈ మధ్య టీడీపీ విషయంలో కాస్త దూకుడు తగ్గించినట్టు అనిపిస్తుంది. ఇదే జనసైనికుల్లో మునుపటి జోష్ లేకుండా చేస్తుంది.

పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలూ ఇద్దరూ జనసేన వైసీపీ, టీడీపీలపై పై చేయి సాధించి అధికారంలోకి రావాలనే కోరుకుంటున్నారు. అంతే కానీ, జగన్ ను బలహీనపరిచి టీడీపీకి పరోక్షంగా మేలు చేయాలని కాదు. సోషల్ మీడియాలో వైసీపీ, జనసేనల మధ్య వార్ పెద్ద ఎత్తున జరుగుతున్న మాట వాస్తవమే. దీనికి బలం చేకూరేలా కడప ఎంపీ స్థానానికి బీసీ అభ్యర్థిని నిలబెట్టగలరా అని జగన్ కు సవాల్ విసిరారు పవన్. ఏపీ, తెలంగాణ మధ్య రాజుకున్న డేటా చోరీ వివాదంలో టీడీపీని టార్గెట్ చేస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. పై పెచ్చు కేసీఆర్ ను ఆంధ్రాకు రావద్దు అనటం అప్రమేయంగా టీడీపీకి మద్దతిచ్చేలా ఉంది. అదికారంలోకి రావాలని భావిస్తున్న జనసేన టీడీపీ, వైసీపీలపై ఒకేరకమైన స్ట్రాటజీతో వెళ్తేనే అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంది. అంతే తప్ప, జగన్ ను ప్రధాన టార్గెట్ చేసుకొని వైసీపీని మాత్రమే బలహీనపరిస్తే పరోక్షంగా చంద్రబాబుకు మేలు చేసినట్టు అవుతుంది కానీ, అధికారంలోకి రావటం సాధ్యపడే అవకాశం లేదు.