పవన్ కు వెన్నునొప్పట!

Monday, October 13th, 2014, 10:02:32 PM IST


ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కు వెన్ను నొప్పి తగ్గడానికి ఆపరేషన్ తప్ప మరో మార్గం లేదని వైద్యులు చెప్పినట్టుగా సమాచారం. కాగా పవన్ కూడా ఈ సర్జరీకి సిద్ధపడుతున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక సర్జరీ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ కొద్ది కాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందట. దీనితో పవన్ సర్జరీ విషయంలో కాస్త ఆలోచనలో పడినట్లు సమాచారం.

అయితే మరి ఈ వెన్ను నొప్పితోనే పవన్ తన తాజా సినిమా షూటింగులలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం గోపాల గోపాల ముగింపు దశకు రావడంతో ఈ సినిమా అనంతరం పవన్ సర్జరీకి సిద్ధపడే అవకాశముంది. ఇక ఈ బ్యాక్ పెయిన్ కారణంగానే పవన్ కొంత కాలంగా రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్నారనే వార్తలు కూడా వ్యాపిస్తున్నాయి. కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భాజపా- టిడిపి కూటమికి మద్దతుగా తన గళాన్ని విప్పిన పవన్ అటు తర్వాత కాలంలో రాజకీయ తెరపై కనబడకపోవడంతో విపక్షాలు ఆయనపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కొందరు నేతలు ప్రశ్నించడానికి పవన్ రాలేదేమి? అని నిలదీస్తే మరికొందరు పవన్ మేకప్ మరియు పేకప్ కే పనికొస్తారని విపరీత వ్యాఖ్యలు చేశారు. అయితే తనను ఎవరు ఏమి అన్నా పవన్ మాత్రం ఎటువంటి స్పందన తెలుపలేదు. ఇక ఒకపక్క వెన్ను నొప్పి, మరో పక్క షూటింగుల బడలికతోనే పవన్ వీటన్నింటికి దూరంగా ఉంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ తమ అభిమాన హీరోకు వెన్ను నొప్పి అంటే పవన్ ఆరాధకులకు తీరని వ్యధే కదా!