గవర్నర్ తో పవన్ భేటీ.. మాస్టర్ ప్లాన్ అదేనా ?

Tuesday, October 23rd, 2018, 12:45:07 PM IST

ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా గవర్నర్ చేత చేయాల్సిన పనికి సంబంధించి ఆదేశాలు అందుకుంటే ఆయన పని తీరు సక్రమంగా లేదనే అర్థం. ముఖ్యమంత్రులు భాద్యతను విస్మరించిన తరుణంలోనే గవర్నర్ కలుగజేసుకుంటారు. ఈ పరిణామమే చోటు చేసుకుంటే ముఖ్యమంత్రి పనితీరు పట్ల ప్రజల్లో అనుమానం తలెత్తడం ఖాయం. ఈ ఫార్ములానే ప్రయోగించాలనుకుంటున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.

తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన సోషల్ మీడియాలో, ప్రెస్ మీట్లలో బాధితుల పట్ల టీడీపీ భాద్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. స్వయంగా బాధితులతో మాట్లాడించి బాబు పట్ల నిరసన తెలియజేశారు. ఇది చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మరిణమించింది. ఈ నిరసనను మరింత గట్టిగా చూపాలనే ఉద్దేశ్యంతో పవన్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు గవర్నర్ నరసింహన్ తో భేటీ కానున్నారు.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుండి, బాధితుల నుండి ఆయన సేకరించిన నివేదికను గవర్నర్ కు సమర్పించి బాధితులను ఆదుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన నరసింహన్ కు విజ్ఞప్తి చేయనున్నారు. పవన్ విజ్ఞప్తిని మన్నించి, నివేదికను పరిశీలించిన తర్వాత గవర్నర్ గనుక ప్రభుత్వ సహాయక చర్యల పట్ల సంతృప్తి చెందకపోతే ఖచ్చితంగా సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తారు. అదే గనుక జరిగే బాబు ఇమేజ్ డ్యామేజ్ కావడం, బాధితుల పట్ల పవన్ అంకితభావం గొప్పదనే భావన ప్రజల్లోకి వెళ్లడం ఒకేసారి జరిగిపోతాయి.