పేదరికాన్ని టార్గెట్ చేసిన పవన్ !

Wednesday, September 26th, 2018, 04:00:59 AM IST

ప్రస్తుతం మన రిజర్వేషన్ సిస్టమ్ పై చాలా మంది ప్రజల్లో ఒక్క రకమైన నిరాసక్తత నెలకొని ఉంది. రాజ్యాంగం ముందు అందరూ సమానమే అంటూ కుల, మతాల పరంగా ఉద్యోగాలు, ఫీజులు, రేషన్, వైద్యం, బ్యాంకు రుణాలు ఇలా అన్నిటిలోనూ అసమానత జరుగుతోందని, నిజంగా అర్హులైన చాలా మంది ప్రభుత్వ సాయం అందక ఇబ్బందులు పడుతుంటే, కొందరు అవసరం లేకపోయినా లబ్ది పొందుతున్నారనే విమర్శలున్నాయి. వీటిలో నిజం కూడ ఉంది.

ప్రస్తుతం సమాజంలో పేరుకుపోయిన అతిపెద్ద అసమానత ఆర్థిక అసమానత. దీనికి కుల, మత, వర్గాలతో పనిలేదు. నిమ్న కులాల్లో ధనికులు ఉన్నట్టే అగ్ర కులాల్లో నిరుపేదలున్నారు. వీరందరికీ ప్రభుత్వ చేయూత అందాలంటే రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఆర్థిక స్తోమతను బట్టి అమలు కావాలి. ఇన్నాళ్లు మన నేతలకు, మేధావులకు ఈ పరంగా సంస్కరణలు చేయడం కుదరలేదు. అందుకే ఇంకా ఆర్థిక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని మార్చగలిగిన వారే అసలైన నాయకులు కాగలరని ప్రజానీకం ముఖ్యంగా యువతరం అభిప్రాయం.

కరెక్టుగా పవన్ ఈ అంశం మీదనే దృష్టి పెట్టాడు. తన ప్రజా ప్రభుత్వం వస్తే ఆర్థిక స్తోమతను బట్టే లబ్ది చేకూరేలా చేస్తానని, అందుకోసం ఈబీసీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తానని, దాని ద్వారా అన్ని వర్గాల్లోనూ ఆర్థికంగా వెనుకబడిన వారికి అండగా నిలబడతానని అంటున్నారు. ఇప్పటికే సమస్యల్ని వెతికి పట్టుకోవడంలో, వాటిని బహిర్గతం చేయడంలో, పరిష్కార మార్గం సూచించడంలో నేర్పు ఉన్న నాయకుడిగా పవన్ కు పేరుంది. దానికి తోడు యువతరం కోరుకునే ఇలాంటి పద్దతిని అమలుచేస్తానని జనసేనాని అంటుండటం పార్టీ పై ప్రజల్లో పాజిటివ్ వైబ్స్ ఏర్పడటానికి దోహదపడుతుంది.