చివరికిది రెచ్చగొట్టే రాజకీయమే అవుతుంది పవన్

Sunday, September 30th, 2018, 10:17:21 PM IST

ప్రస్తుతం పవన్ చేస్తున్న ప్రజాపోరాట యాత్ర రసవత్తరంగా సాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై విమర్శల వర్షం కురిపించిన ఆయన ఎన్నికల్లోపు తనను చంపాలని ముగ్గురు వ్యక్తులు నిర్ణయించుకున్నారని, వాళ్లంతా కలిసి తన హత్య గురించి మాట్లాడుకున్న ఆడియో, వీడియోలు తన వద్ద ఉన్నాయని చెప్పి కలకలం సృష్టించారు. పవన్ నోటి వెంట తన హత్యకు ప్లాన్ జరుగుతోంది అనే మాట వినగానే అభిమానుల్లో ఆవేశం రెట్టింపైంది.

సోషల్ మీడియా సాక్షిగా ఫ్యాన్స్ గ్రూప్స్ నానా హడావుడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ రక్షణ విషయమై నిలదీస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ డీజీపీ ఆర్ఫీ ఠాకూర్ పవన్ రక్షణ భాద్యత తమదేనని అన్నారు. అలాగే చంపాలని చూస్తున్నది ఎవరో తెలుసంటున్నాడు కాబట్టి వారి పేర్లను, తన దగ్గరున్న ఆడియో, వీడియో టేపులను ఇస్తే విచారణకు హెల్ప్ అవుతుందని కూడ అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఆ పేర్లను బయటపెట్టలేదు.

కనీసం తనపై హత్యా ప్రయత్నం జరిగే ఛాన్సుందని కేసులు కూడ పెట్టలేదు. దీంతో రాజకీయ ప్రత్యర్థులు పవన్ కేవలం అభిమానుల్ని రెచ్చగొట్టడం కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని, నిజంగా కుట్రదారులెవరో తెలిస్తే బయటకు చెప్పొచ్చు కదా అని అంటున్నారు. వాళ్ళ మాటల్లోనూ నిజం లేకపోలేదు. తాను చెప్పే మాటలు నిజమైతే అనుమానితుల పేర్లను బహిరంగంగా కాకపోయినా రహస్యంగా అయినా పోలీసులకు చెప్పి విచారణ నిమిత్తం వారికి సహకరించాలి పవన్. అలా కాకుండా ఎంతసేపు నన్ను హత్య చేయాలని చూస్తున్నారని పదే పదే బహిరంగ సభల్లో మాట్లాడటం రెచ్చగొట్టే రాజకీయమే అవుతుంది మరి.