ఇంతకీ సింబల్ కన్ఫర్మ్ అయిందా పవన్ ?

Wednesday, October 10th, 2018, 12:45:41 PM IST

ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీని స్థాపించగానే దాని జెండాతో పాటే ఎన్నికల గుర్తును కూడ ఫైనల్ చేసుకుని ఎన్నికల కమీషన్ వద్ద రిజిస్టర్ చేయించుకుంటారు. కానీ పవన్ ఇంకా తన జనసేన ఎన్నికల గుర్తును అధికారికంగా రిజిస్టర్ చేసుకోకపోవడం గమనార్హం. ముందుగా పార్టీ జెండాలోని నక్షత్రం గుర్తే జనసేన సింబల్ అని అందరూ అనుకున్నారు. అది జనాల్లో కూడ బాగానే ప్రాచుర్యం పొందింది.

కానీ ఈ మధ్య పవన్ తన ఎన్నికల గుర్తు పిడికిలి అని ప్రజాపోరాట యాత్రలో ప్రకటించారు. కానీ ఆ తరవాత దాని ఊసే ఎత్తడం లేదు. ఒక పార్టీకి ఓట్లు వేయాలంటే దాని గుర్తు ఏమిటో ఈవీఎం మిషన్ల మీద ముసలివాళ్ళు సైతం గుర్తుపట్టగలిగేలా ఉండాలి. అప్పుడే జనాలకు ఒక క్లారిటీ ఉండి ఓట్లు ఖచ్చితంగా పడతాయి. ఈ విషయం పవన్ కు తెలియనిది కాదు.

అయినా ఆయన గుర్తును జనాల్లోకి తీసుకెళ్లడానికి పెద్దగా పనిచేస్తున్న దాఖలాలు కనబడటం లేదు. ఎలాగూ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు కాబట్టి వాటిలోనే పిడికిలి గుర్తు గురించి నాలుగు మాటలు మాట్లాడి జనంలోకి తీసుకెళితే మంచిది. అదే విధంగా ఎన్నికల కమీషన్ వద్ద కూడ త్వరగా పిడికిలిని ఫైనల్ చేసుకునే మార్గాన్ని చూసుకోవాలి. అలా కాకుండా ఆలస్యం చేసి ఆఖరి నిముషంలో హడావుడి చేస్తే కమీషన్ ఇచ్చే ఏదో ఒక అనామక గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగాల్సి వస్తుంది.