దమ్ము చూపించేందుకు సిద్దమైన పవన్ !

Thursday, October 4th, 2018, 01:20:59 PM IST

ఒక రాజకీయ నాయకుడి బలం బహిరంగంగా బయటపడాలంటే అతని వెనకున్న జనమే కొలమానం. ఎంత మంది జనం ఆ నాయకుడి వెంట నడిస్తే అతనికి అంత పవర్ ఉన్నట్టు అర్థం. ప్రస్తుతం వైఎస్ జగన్ ఇదే ఫార్ములాను ఫాలో అవుతూ సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రమంతా పర్యటిస్తుండగా పవన్ కూడ పోరాట యాత్ర పేరుతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

అయితే పవన్ బహిరంగ సభలు మినహా ఇప్పటి వరకు ముందుగా ప్లాన్ చేసి భారీ ఎత్తున ర్యాలీ లాంటిది నిర్వహించలేదు. అందుకే ఈసారి అలాంటి భారీ కవాతును సెట్ చేశారాయన. ఈ నెల 9న కొవ్వూరు నుండి రాజమండ్రి వరకు కవాతు చేయాలని, దీంతో తమ బలమేంటో అధికార, ప్రతి పక్షాలకి తెలియజేయాలని నిర్ణయించుకున్నారట.

అందుకే ఈ షోకు భారీ సంఖ్యలో అభిమానులు, ప్రజలను హాజరయ్యేలా చూడాలని శ్రేణులకు గట్టి పిలుపునిచ్చారట. ఈ మేరకు ప్రధాన శ్రేణులన్నీ జన సమీకరణకు సిద్దమయ్యాయని తెలుస్తోంది. పవన్ రోడ్ షో అంటే పిలవకుండానే వేల కొద్ది అభిమానులు వస్తుంటారు. ఇక ఆయన పట్టుబట్టి మరీ మీరు రావాల్సిందే, నాతో కలిసి నడవాల్సిందే అని పిలుపునిస్తే సామాన్య జనం నుండి స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా ఈ కవాతు విజయంపైనే ప్రజల్లో పవన్ బలమేమిటో బయటపడనుంది.