ఏం చేస్తారో చేయండి.. దేశం మొత్తం మాట్లాడుకోవాలి !

Sunday, October 7th, 2018, 11:49:07 AM IST

పార్టీ పెట్టి, ప్రజల్లో తిరుగుతూ ఎన్నో చోట్ల బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఏనాడు తన అభిమానుల్ని సభలకు రెండుకి, మీతోపాటు భారీ సంఖ్యలో జనాన్ని తీసుకురండి అని చెప్పిన సందర్భాలు లేనే లేవు. అలాంటిది ఆయన ఈసారి చేయబోయే కవాతుకు భారీ సంఖ్యలో జనం రావాలని అల్టిమేటం జారీ చేశారు.

గోదావరి జిల్లాలే జనసేనకు ప్రధాన బలమనే సంగతి తెలిసిందే. ఆరంభం నుండి ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పవన్ ఇప్పటికే పశ్చిమ గోదావరిలో పోరాట యాత్ర చేస్తూ ఈ నెల 15 నుండి తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ టూర్ గ్రాండ్ సక్సెస్ అయితే ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం మీద కనిపిస్తుంది. ఆయన బలమేమిటో బహిర్గతమవుతుంది. అంతేకాదు ఇతర రాజకీయ వర్గాల్లో గొప్ప కుదుపును కూడ తెస్తుంది.

అందుకే 15న ధవళేశ్వరం బ్యారేజీపై కవాతు నిర్వహించనున్నారు పవన్. ఆ కవాతును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన ఏం చేస్తారో చేయండి, అందరూ సహకరించాలి, కవాతు గురించి దేశం మొత్తం మాట్లాడుకోవాలి అంటూ అభిమానులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పిలవకుండానే పవన్ సభలను విజయవంతం చేస్తూ వచ్చిన అభిమానులు ఈసారి తమ నాయకుడు పట్టుబట్టి మరీ పిలుస్తుండటంతో 10 రెట్లు ఎక్కువ ఉత్సాహంగా కదులుతున్నారు. గోదావరి జిల్లాల అభిమానులు, కార్యకర్తలు అందరూ 15న ధవళేశ్వరం బ్యారేజీ మీదే ఉండాలని తీర్మానించుకున్నారు. మరి చూడాలి జనసేనాని కవాతును అభిమానులు ఏ స్థాయిలో సక్సెస్ చేస్తారో.