మొదటిసారి పార్టీ శ్రేణులకు పవన్ వార్నింగ్ !

Tuesday, February 12th, 2019, 11:43:46 AM IST

పార్టీని ఎన్నికలకు సిద్దం చేసే తరుణంలో పవన్ వివిధ కమిటీలను నియమిస్తూ పోతున్నారు. అందులో భాగంగానే ఇటీవల అమలాపురం, ఏలూరు, విజయనగరం, అరకు, అనకాపల్లి, కాకినాడ లోక్ సభ నియోజకవర్గాలకు గాను పార్లమెంటరీ కమిటీలను నియమించారు. అన్ని ప్రమాణాలని దృష్టిలో పెట్టుకుని వీటిని ఏర్పాటుచేశారు. కానీ మొదటి నుండి పనిచేస్తున్న కొందరికి వీటిలో చోటు దక్కలేదు. దాంతో వాళ్లు పార్టీపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఏలూరు పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మత్తే బాబి కమిటీలో చోటు దక్కలేదని పార్టీలో సమన్యాయం లేదంటూ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పవన్ త్వరలో నియోజకవర్గ, మండల కమిటీలను నియమించనున్న తరుణంలో ముందు జాగ్రత్తలు పాటిస్తున్నారు.

ఎందుకంటే ఈ కమిటీల్లో సభ్యత్వం కోసం చాలామంది పోటీపడనున్నారు. కాబట్టి అసంతృప్తులు ఎక్కువగా తయారవుతారు. వారంతా పార్టీకి రాజీనామా చేయడం, ఆరోపణలు చేయడం లాంటివి చేస్తే నష్టం తప్పదని అంచనా వేసిన జనసేనాని పార్టీలో క్రమశిక్షణ వ్యవహారాలు కఠినంగా ఉంటాయని, ప్రథమ శ్రేణి న్యాయకత్వపు నిర్ణయాల్ని పార్టీ భవిష్యత్తును ద్రుష్టిలో పెట్టుకుని గౌరవించాలని నెమ్మదిగా హెచ్చరికలు జారీచేశారట.