మినిస్టర్ పై జనాగ్రహం…..అనుచిత వ్యాఖ్యలే కారణం?

Monday, June 25th, 2018, 11:34:29 AM IST

టిఆర్ ఎస్ మంత్రి జి.జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నేడు వేములవాడ ఘటనలో మరణించిన వారి మృతదేహాలకు పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక పిహెచ్ సి వద్దకు చేరుకున్న ఆయన మృతుల బంధువలను పరామర్శించి తన సానుభూతిని తెలిపారు. అయితే ఆ సమయంలో అక్కడకు వచ్చిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి అనిల్ కుమార్ రెడ్డి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల చప్పున పరిహారం ఇవ్వాలని కోరగా, అక్కడి స్థానికులు కూడా ఆ డిమాండ్ ను నెరవేర్చాలని గట్టిగా నినాదాలు చేయసాగారు. అయితే మంత్రి మాట్లాడుతూ, రూ.15లక్షలు సరిపోతాయా లేక రూ.50 లక్షలు కావాలా అంటూ వ్యంగ్యంగా మాట్లాదారు. మృతుల ప్రాణాలను వ్యాపారంగా మార్చవద్దని, శవాల దగ్గర చిల్లా రాజకీయాలు చేయొద్దని అనిల్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

అంతే అక్కడున్న ప్రజలు ఆయన వ్యాఖ్యలకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అరవడం ప్రారంభించారు. అయితే తమ ప్రభుత్వం తరపున రూ.2.5 లక్షల పరిహారం తో పాటు స్థలం లేని వారికీ స్థలం, మరియు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని, అలానే మృతుల పిల్లలకు కేజీ నుండి పిజి వరకు చదువు చెప్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే మంత్రి వ్యాఖ్యలకు సమ్మతించని గ్రామస్థులు పోస్ట్ మార్టం నిర్వహించిన మృతదేహాలను గ్రామానికి తరలించడంలో అడ్డుపడడంతో దాదాపు 3 గంటలపాటు అక్కడ ఉద్రిక్తత చెలరేగింది. ఇక చివరకు పోలీస్ లు కలుగ చేసుకుని గ్రామస్థులను పిలిపించి రూ.2.5 లక్షలు సహా, స్థానిక ఎమ్యెల్యే తో మరొక రూ.1 లక్ష, స్థలం తోపాటు ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో వారు మృతదేహాలను గ్రామానికి తరలించారు…..