ఫోన్ ట్యాపింగ్‌తో డేంజ‌ర‌స్ పొలిటిక‌ల్ గేమ్‌

Tuesday, October 30th, 2018, 11:20:03 AM IST

తెలంగాణ ప్ర‌భుత్వం త‌మ ఫోన్‌ల‌ను ట్యాపింగ్ చేస్తోందంటూ విప‌క్షాలు గ‌త కొన్ని నెల‌లుగా వాదిస్తున్న విష‌యం తెలిసిందే. తెలంగాణ ప్ర‌భుత్వంపై, ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై టీడీపీ మాజీ నేత‌, ప్ర‌స్తుత కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గ‌త కొంత కాలంగా తెలంగాణ పోలీసులు, ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్ష నాయ‌కుల ఫోన్‌ల‌ను ట్యాపింగ్ కు పాల్ప‌డుతోందంటూ, త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని హైకోర్టును, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాన్నిఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. దీనిపై ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ర‌జ‌త్‌కుమార్ రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డిని వివ‌ర‌ణ కోరారు.

దీనిపై డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. జాతీయ భ‌ద్ర‌త‌, నేరాల నిర్మూల‌న కోసం క‌ట్టుదిట్ట‌మైన విధానాల‌కు లోబ‌డే ఫోన్ లు ట్యాపింగ్ చేస్తున్నామ‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. చ‌ట్ట నిబంధ‌న‌ల‌కు వ‌య‌తిరేకంగా అక్ర‌మ ప‌ద్ద‌తుల ద్వారా ఫోన్ ల ట్యాపింగ్‌కు ఆస్కారం లేద‌ని, దీనికి సంబంధించి వ్య‌వ‌స్థ‌లో అక్ర‌మాల నిరోధానికి త‌ట‌స్థ‌త‌ను కాపాడేందుకు చ‌ట్ట‌బ‌ద్ద ఏర్పాట్లున్నాయ‌ని పేర్కొన్నారు. అయితే మ‌హాకూట‌మి నేత‌లు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదు లేఖ‌లో ఎక్క‌డా ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ప్ర‌స్థావ‌న చేయ‌లేద‌ని డీజీపీ పేర్కొన‌డం కొస‌మెరుపు.

అయితే మ‌హాకూట‌మి నేత‌లు మాత్రం డీజీపీ స‌మాధానంతో సంతృప్తి చెందిన‌ట్లు క‌నిపిస్తోంది. డీజీపీ ఇచ్చిన స‌మాధానం మీకు సంతృప్తిక‌రంగా వుంద‌నిపించిందా? అని రాష్ట్ర ఎన్నిక‌ల అధికారిని విలేరులు అడిగితే ఊహించ‌ని స‌మాధానం రావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌తి ప‌క్ష నాయ‌కుల ఫోన్‌లు ట్యాప్ చేయ‌డం లేద‌ని డీజీపీ అంగీక‌రించ‌క‌పోయినా త‌ను చెప్పిన స‌మాధానం స‌బ‌బుగానే వుంద‌ని ర‌జ‌త్‌కుమార్ చెప్ప‌డం మ‌హాకూట‌మి నాయ‌కుల్ని విస్మ‌యానికి గురిచేస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments