దివ్యంగుడైన భర్త… అతని భార్య ఏమి చేసిందంటే ?

Wednesday, April 4th, 2018, 11:58:08 PM IST


భార్య భర్తల అనుబంధం అంటే ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడమే. ఒకరి తప్పు ఒప్పులను మరొకరు క్షమించి, అలానే ఒకరి సమస్యలకు మరొకరు తోడుగా నిలిస్తే ఆ జంట కలకాలం ఆనందంగా జీవిస్తుంది అని మన పెద్దలు ఎందరో చెప్పారు. అయితే ప్రస్తుతం జరిగిన ఒక సంఘటన వింటే నిజంగా మనసు చెలించిపోతుంది. దివ్యాంగుడైన భర్తను భుజాలపై మోసుకు వెళుతున్న ఓ స్త్రీ మూర్తికి ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. వివరాలలోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లోని మధురకు చెందిన బిమ్లా దేవి అనే మహిళ నరాల సంబంధిత వ్యాధితో కుడికాలు కోల్పోయిన తన భర్త బదన్‌ సింగ్‌ను గత కొన్ని నెలలుగా భుజాలపై ప్రభుత్వ ఆస్పత్రికి మోసుకెళుతోంది.

బదన్‌ సింగ్‌కు వీల్‌ చైర్‌ ఇవ్వడానికి ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు, దివ్యాంగుడని ధ్రువీకరణ పత్రం తీసుకురమ్మన్నారు. దీంతో ఆమె ఆ సర్టిఫికేట్‌ కోసం భర్తను మోసుకుని వెళుతూ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ చాలాకాలంగా తిరుగుతోంది. అయినా అధికారులు ఏమాత్రం కనికరించలేదు. సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు ఆమెను కార్యాలయం చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. ఈ విషయమై బిమ్లా దేవి మాట్లాడుతూ, ధ్రువీకరణ పత్రం పొందడానికి చాలా కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయింది. అయితే ఆ దంపతుల ఫోటో ఉత్తరప్రదేశ్‌ మంత్రి భూపేంద్ర చౌదరి కంట పడింది. దీనిపై వెంటనే స్పందించిన ఆయన, వారికి సహాయం అందకపోవడం నాగరిక సమాజానికి సిగ్గుచేటని, వెంటనే ఆ భార్యాభర్తలకు సహాయం అందేలా చేస్తానని భరోసా ఇచ్చారు.

ఎట్టకేలకు బుధవారం బిమ్లా దేవి దంపతులకు ధ్రువీకరణ పత్రం అందడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొద్ది నెలల ముందు వరకు వారి జీవితం సాఫీగా సాగిపోయేదని, నరాల వ్యాధి కారణంగా తన భర్త కాలు కోల్పోవడంతో కష్టాలు చుట్టుముట్టాయని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆటోలో వెళ్లడానికి కూడా డబ్బులు లేవని, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నామని ఆమె వివరించింది. భర్త కాలుపోవడంతో కుటుంబ భారంతో పాటు భర్తకు మందులు కొనే బాధ్యత కూడా బిమ్లా భుజాలపై పడింది. ఆ విధంగా భర్తలో సగమైన ఆ స్త్రీమూర్తి పడుతున్న కష్టానికి ఆమెని అభినంధించితీరాల్సిందే అని పలువురు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments