ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార తెలుగుదేశం పార్టీ సిత్రాలు రోజురోజుకీ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను అమలుపర్చని కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఒక రోజు దీక్ష చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో చంద్రబాబు దీక్షకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెల్పిన సంగతి కూడా తెలిసిందే. అయితే నాడు ఏపీకి ప్రత్యేకహోదా సంజీవని కాదని, ప్రత్యేక ప్యాకేజీ అంతకుమించి ఉంటుందని, ఇకముందు ఎవరైన ప్రత్యేకహోదా అంటూ ఆందోళణలు, ధర్నాలు చేస్తే జైల్లో పెడతామని చంద్రబాబు ప్రకటించడమే కాకుండా కొంతమంది పై కేసులు కూడా పెట్టారు.
ఇక చంద్రబాబు దీక్ష పై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఎన్నికల టైమ్లో చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తూ మరో కొత్త నాటకానికి తెరలేపారని, నాడు అసెంబ్లీలో ఇదే చంద్రబాబు ప్రత్యేకహోదాను ఖూనీ చేశారని, అయితే వైసీపీ మాత్రం నిత్యం పోరాటం చేస్తూనే ఉందని, ఇప్పడు బాబు యూటర్న్ తీసుకోవడానికి కారణం తామ పోరాటమే అని వ్యాఖ్యానించారు.
ఇక ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. దీంతో స్పందించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబు చెప్పిన విధంగానే ఏపీకి ప్రత్యేకప్యాకేజీ ఇచ్చామని, ఆంధ్రరాష్ట్రానికి ప్రకటించిన ఈ ప్రత్యేకప్యాకేజీని చంద్రబాబు స్వాగతించారని, ఈమేరకు ధన్యవాదాలు తెల్పుతూ.. కేంద్రప్రభుత్వానికి లేఖ కూడా రాశారని పీయూష్ గోయల్ అసలు విషయం బయటపెట్టారు. దీంతో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో చంద్రబాబు మళ్ళీ ప్రత్యేకహోదాని తెరపైకి తెచ్చారు.. మరి చంద్రబాబును ఎలా నమ్మాలి అంటూ సర్వత్రా చర్చించుకుంటున్నారు.