ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న తెరాస…

Thursday, November 8th, 2018, 05:41:09 PM IST

ఇప్పుడు జరిగే ముందస్తు ఎన్నికలలో కొత్తగా పుట్టుకొచ్చిన మహాకూటమి వేసే ఎత్తులకు, తెరాస పైఎత్తులు వేస్తోంది. కూటమి ఎత్తులను తీక్షణంగా పరిశీలిస్తూ , వాటికి అనుగుణంగా పైఎత్తులు వేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈనెల 9న మహాకూటమి అభ్యర్థులను ప్రకటిస్తే, అదే రోజు లేదా 10న తెరాస తన తుది జాబితా విడుదలచేయనుంది. గురువారం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశాలున్నందున, శుక్రవారం పూర్తి స్థాయి ఎన్నికల హామీలను ప్రకటించేందుకు తెరాస కసరత్తులు చేస్తుందని సమాచారం. సోనియా గాంధీ, రాహుల్, చంద్రబాబు సభలకు అనుగుణంగా కేసీఆర్ సభలను నిర్వహించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. తమ అభ్యర్థులను రెండు నెలల క్రితమే ప్రకటించడంతో పాటు పలు సభలు నిర్వహించిన సీఎం కేసీఆర్, మహాకూటమి వ్యూహాలపై స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పార్టీ మరో 12 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా, ఇప్పటికే అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసిన తెరాస మహాకూటమి అభ్యర్థుల ప్రకటన కోసం ఎదురు చూస్తోంది. ఖైరతాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, చొప్పదండి వంటి నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా ఉన్నందున అక్కడ టిక్కెట్ దక్కని నేతలు పార్టీ మారకుండా ఉండేందుకు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వెల్లడిస్తే.. రేపు లేదా ఎల్లుండి తెరాస తుది జాబితా ఖరారు కానుంది.

మేనిఫెస్టో ప్రకటనలోనూ మహాకూటమి ఎత్తులను తెరాస గమనిస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టో రేపు వెల్లడిస్తే.. ఎల్లుండి తెరాస ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించిన తెరాస పూర్తిస్థాయి ఎన్నికల హామీలను సిద్ధం చేసి ఉంచింది. కొన్ని అనూహ్యమైన, ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించాలని భావిస్తున్న తెరాస.. వాటిని ఇతర పార్టీలు కూడా అనుసరించే అవకాశం ఉందన్న ఆలోచనతో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం.