దయచేసి ఈ దారుణాన్ని రాజకీయం చేయకండి : చిన్నారి తండ్రి ఆవేదన

Saturday, April 14th, 2018, 10:07:51 AM IST

మహిళలను దేవతలుగా కొలుస్తామని చెప్పుకునే మన పుణ్యభూమిలో.. అన్నెంపున్నెం ఎరుగని చిన్నారి బాలికలకు కూడా రక్షణ లేకుండా పోయింది. జమ్ముకశ్మీర్‌లోని కతువాలో ఎనిమిదేండ్ల బాలికపై.. మతోన్మాదం తలకెక్కిన ఓ తండ్రి ప్రోద్బలంతో అతడి కొడుకు, మేనల్లుడు, వారి స్నేహితులు, పోలీసులు నాలుగు రోజులపాటు లైంగికదాడులు జరిపారు. అన్ని రోజులపాటు ఆ చిన్నారికి ఆహారం ఇవ్వలేదు కానీ, మత్తుమందులు ఇచ్చారు. చివరికి గొంతు పిసికి చంపటానికి ముందు కూడా రేప్ చేశారు. చంపిన తర్వాత.. ప్రాణం పోయిందని నిర్ధారణ చేసుకోవటానికి బండతో తలపై మోదారు. ఊహించుకుంటేనే కడుపులో పేగులు కదిలిపోయేలా ఉన్న ఈ దారుణకాండ యావత్తూ ఒక గుడిలో జరిగింది. పరమతానికి చెందిన వారిపై తల నిండా విషం నింపుకున్న ఉన్మాది మనసులో విచ్చుకున్న ప్రతీకారం ఈ దారుణానికి కారణమయ్యింది. మరో ఘటనలో యూపీలోని ఉన్నావ్‌లో ఏకంగా ఒక ఎమ్మెల్యే, అతడి సోదరుడు 17 ఏండ్ల యువతిపై లైంగికదాడి జరుపటమేగాక ఆ యువతి తండ్రిని తీవ్రంగా కొట్టి అతడి మృతికి కారణమయ్యారు. ఈ దారుణాలపై ఇప్పుడు యావత్‌దేశం భగ్గుమంటున్నది. ఈ దేశంలో ఆడవాళ్లని బతుకనివ్వరా అని అడుగుతున్నది. నేరస్థులను అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నది.

తన బిడ్డకు జరిగిన అన్యాయం రేపు ఇంకెవరికైనా జరుగవచ్చని, దారుణ ఘటనను దయచేసి రాజకీయం చేయవద్దని కతువా బాధితురాలి తండ్రి కోరారు. చాలామంది తమ తమ ప్రయోజనాల కోసం ఈ ఘటనను వాడుకుంటున్నారు. దారుణ ఘటనను నిరసిస్తే ఫర్వాలేదు కానీ, దాని నుంచి ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నించకండి అని ఆయన రాజకీయపక్షాలను అభ్యర్థించారు. కతువా ఘటనలోని కిరాతక కోణాన్ని క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు బయటపెట్టిన రెండోరోజే రసోనాలో ఉన్న తమ ఇంటికి తాళం వేసి, ఆ కుటుంబం గ్రామాన్ని విడిచిపెట్టింది. ఉద్ధంపూర్ జిల్లాలోని దుమేల్ గ్రామ శివార్లలో వారు ప్రస్తుతం తలదాచుకుంటున్నారు. మా అందరినీ అభద్రత ఆవహించింది. నా బిడ్డను చంపిన హంతకులకు మద్దతిస్తున్నవారిని చూస్తుంటే, ఆ భయం ఇంకా పెరిగిపోతున్నది. అందుకే అక్కడ ఉండలేకపోయాం అని ఆయన తెలిపారు. కతువా కేసులో సిట్ దర్యాప్తును నిరసిస్తూ హిందూ ఏక్తా మంచ్ మార్చి4న నిర్వహించిన ర్యాలీలో బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రులు చౌదరీలాల్ సింగ్, చంద్రప్రకాశ్ గంగా కూడా పాల్గొన్నారు.

దీన్ని ప్రస్తావించిన చిన్నారి తండ్రి రేపిస్టులకు వారు మద్దతిస్తున్నారు. అంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? అని ప్రశ్నించారు. గుజ్జార్ బకర్వాల్ తెగకు చెందిన మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్న ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయి. కానీ వారు ఇంతవరకు వెళ్తారని ఊహించలేదు. కుడి ఏదో, ఎడమ ఏదో కూడా తెలియని పసితనం నా బిడ్డది. అలాంటి చిన్నారికి హిందూ, ముస్లిం అన్న ఆలోచన అసలు ఉంటుందా? వాళ్లకు ప్రతీకారం తీర్చుకోవాలని అనిపించి ఉంటే, ఆ పసిదాన్ని కాకుండా మాలో ఇంకెవరినైనా ఎంచుకోవాల్సింది. కిడ్నాప్ కావడానికి నాలుగురోజుల ముందు కొత్త బట్టలు వేసుకుని నా బిడ్డ సంబురపడింది. ఆ దృశ్యమే నా కళ్లముందు కదలాడుతున్నది. చిన్నారిపై అఘాయిత్యం జరిపిన గుడి పక్కనుంచే నేను రోజూ నడుచుకుంటూ వెళ్లేవాణ్ని. అదేమీ తెలియకపోవడం వల్ల గుడిలోకి తొంగిచూసే ప్రయత్నం చేయలేకపోయాను అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. విషయాన్ని తాము కోర్టుకు వదిలేశామని చెప్పారు. తమ అత్యున్నత న్యాయస్థానం అల్లానేనని, అక్కడ ఎవరైనా విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఆయన అన్నారు.