మనకు అన్యాయం చేసినవారికి మాత్రం ఓటు వేయొద్దు : చంద్రబాబు

Thursday, May 10th, 2018, 05:10:17 PM IST

ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ బిజెపి సహా మిగతా పార్టీలన్నీ తమ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే అమిత్ షా, రాహుల్ గాంధీ వంటి బడా నేతలు అక్కడ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అక్కడి ప్రముఖ పార్టీ జేడీఎస్ మాత్రం తమదే అధికారమని, ప్రజలు ఈ సారి మాకు అవకాశం ఇవ్వనున్నారని ఆ పార్టీ అధినేతలు కుమార స్వామి, దేవగౌడ అంటున్నారు. అయితే అక్కడ సర్వే ఫలితాలు మాత్రం హంగ్ ఏర్పడుతుందని చెపుతున్నాయి. కాగా నేడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్ణాటక ఎన్నికలపై పెదవి విప్పారు.

కర్ణాటకలో కొన్నిప్రాంతాల్లో మన తెలుగువారు ఎక్కువగా వున్నారని, నిజానికి తాను అక్కడ ఫలానా పార్టీకి ఓటు వేయమని ఎవ్వరికీ పిలుపు ఇవ్వలేదన్నారు. అయితే మన తెలుగు వారికి అన్యాయం చేసినవారికి మాత్రం ఓటు వేయొద్దని చెపుతున్న్నాను అన్నారు. అవినీతి కేసుల్లో చిక్కున్న జగన్ పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకోవాలని చూస్తోందని, లేదంటే ఎన్నికల తర్వాతైనా ఆ పార్టీని కలుపుకు పోవాలని బిజెపి నేతలు కుట్రలు పన్నుతున్నారు అని చంద్రబాబు అన్నారు. ఓ వైపు రాష్ట్ర ప్రయోజనాలకోసం, రాజధాని అభివృద్ధి కోసం నేను పోరాడుతుంటే, మరోవైపు అవినీతి వైసిపి తనపై అర్ధంలేని పోరాటం చేస్తోందని, అందుకే ఇక్కడ వైసిపిని, కర్ణాటకలో బిజెపిని ప్రజలు చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు……..