మోడీ, చంద్రబాబు ఇద్దరూ ఆంధ్రులకు దొరికిన వరం

Tuesday, December 27th, 2016, 09:24:42 AM IST

venkainaidu
ప్రధాని మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దొరికిన వరం అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. వీరిలో ప్రధాని అన్నీ ఇస్తారని, ముఖ్యమంత్రి అన్నీ చేస్తారని వెంకయ్య నాయుడు అన్నారు. ఈ జోడి ఆంధ్రా ప్రజలకు వరం అని చెప్పారు. ఈ ఇద్దరూ కలిసి పోలవరం ప్రాజుక్టుతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో చేపడుతున్నారని వెంకయ్య ప్రశంసించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పేరు చెప్పగానే భారత ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గుర్తుకు వస్తారని, అలాగే పోలవరం ప్రాజెక్ట్ పేరు చెప్తే ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తారని వెంకయ్య నాయుడు అన్నారు.

1981లో పోలవరం ప్రాజెక్టుకు మొదటిసారిగా శంకుస్థాపన జరిగిందని, ఆ రోజుల్లో తాను ఎమ్మెల్యేగా ఉన్నానని, తాను అసెంబ్లీలో మాట్లాడుతూ పోలవరానికి పునాది రాయే సమాధి రాయి అయ్యిందని తాను విమర్శించేవాడినన్నారు. ఈ ప్రాజెక్ట్ అసలు ఎప్పటికి పూర్తి అవుతుందని ప్రశ్నించేవాడినని… అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తరువాత మూడు సంవత్సరాలలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకోవడం చాలా గొప్ప విషయం అని, ఇందుకు తాను చాలా సంతోషిస్తున్నానని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ తో రాయలసీమ, విశాఖకు నీళ్లు లభిస్తాయన్నారు. యూపీఏ ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం మినహా ఇంకేం చేయలేదనీ, ఎన్డీయే ప్రభుత్వమే ఈ ప్రాజెక్టుకు నిధులిస్తుందని వెంకయ్య నాయుడు చెప్పారు.

  •  
  •  
  •  
  •  

Comments