ఢిల్లీలో మనవాళ్లకు ట్రీట్మెంట్ మారిపోయింది !

Wednesday, September 26th, 2018, 03:06:05 AM IST

ప్రధాని మోడీ తీరు ఎలాంటిదో అందరికీ తెలిసిందే. కావాల్సి వస్తే చంకనబెట్టుకోవడం లేకుంటే చతికిలబడేయడం ఆయన అలవాటు. ప్రస్తుతం మోడీ వద్ద ఏపీ మంత్రుల పరిస్థితి ఇదే. దోస్తీ వీడిపోక ముందు పదే పదే ఢిల్లీ వెళ్లి మోడీని కలిసేవారు మన చంద్రబాబు. మోడీ కూడ బాబు వెళ్లినా ధారాళంగా సమయం కేటాయించేవారు. మన మంత్రులకు కూడ అంతే. చివరికి శుభాకాంక్షలు తెలపడానికి వెళ్లినా కలిసే అవకాశమిచ్చేవారు మోడీ.

కానీ ఇప్పుడు కనీసం దగ్గరకు కూడ రానివ్వడం లేదు. హోదా విషయంలో మన వాళ్ళు ఎదురుతిరగడంతో మోడీ కూడ టీడీపీ లీడర్లకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వడంలేదు. పొత్తు బెడిసికొట్టక ముందు అనేకసార్లు ఢిల్లీ వెళ్లిన బాబు కటీఫ్ చెప్పిన తరవాత మోడీని కలిసిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే మోడీ మొహం చాటింపు వ్యవహారం బాబుకు తెలుసు కాబట్టి.

ఇక మంత్రులకు కూడ ఈ విషయం తెలిసినా బాధ్యతల నిర్వహణ కోసం తప్పక ఢిల్లీ వెళ్ళుతున్నారు. వెళ్లి పిఎమ్ అపాయింట్మెంట్ కోసం నానా యాతనలు పడుతున్నారు. చచ్చి చెడి అపాయింట్మెంట్ తెచ్చుకున్నా అది కూడ చాలా తక్కువగానో ఒక్కోసారి మరీ సెకన్లలోనో ఉంటోంది. తాజాగా విభజన సమస్య, విశాఖ రైల్వే జోన్ వ్యవహారంపై ఢిల్లీ వెళ్లిన కొందరు ఎంపీలకు మోడీ ఇచ్చిన సమయం 49 సెకన్లు మాత్రమే. దీంతో మనవాళ్లంతా వ్యక్తిగత మీటింగులు పెట్టుకుని మరీ మోడీ తీరుపై మండిపడిపోతున్నారు.