మోదీ ఆన్ లైన్ రహస్య అజెండా…?

Thursday, April 19th, 2018, 04:20:32 PM IST

కేంద్రం క్రమంగా నోట్ల పాత్ర తగ్గించి, ప్రజలను ఆన్‌లైన్ లావాదేవీల వైపు నడిపిస్తున్నదనే అనుమానాలు ఇప్పుడు మరింతగా వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్ లావాదేవీలను మాత్రమే అమలుచేయడం సాధ్యమా అనే విషయం ఎట్లా ఉన్నా, ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశమే కనుక ఉంటే ఆ విషయాన్ని తేటతెల్లంగా చెప్పాలె. ప్రజాస్వామ్య వ్యవస్థలో రహస్య అజెండాలు ఉండకూడదు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా ప్రధాని హఠాత్తుగా ప్రకటించారు. దీనివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు.

పెద్ద నోట్ల రద్దు కాలం నాటి చేదు జ్ఞాపకాలు మళ్లా ప్రజల అనుభవానికి వస్తున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం అటువంటి సమస్యే లేనట్టు మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఏటీఎంలలో డబ్బు లేక ప్రజలు బేజారయిపోతున్నారు. ఇది మన రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ర్టాల నుంచి కూడా ఇటువంటి సమాచారమే వస్తున్నది. తెలంగాణలోనే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ తదితర రాష్ర్టాలలో నోట్ల కొరత పీడిస్తున్నది. కొన్ని నెలలుగా ఈ సమస్య ముదురుతూ వస్తున్నది. అయినా కేంద్రం సమస్య ఉన్నట్టు అంగీకరించడమే లేదు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సమస్య లేదంటూనే ఉన్నట్టు పరోక్షంగా అంగీకరిస్తున్నారు. కరెన్సీ పరిస్థితిపై సమీక్ష జరిపామని, బ్యాంకులలో అవసరానికి మిం చిన కరెన్సీ అందుబాటులో ఉందని ఆయన అన్నారు.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హఠాత్తుగా అసాధారణ స్థాయిలో ప్రజలు నోట్లు తీసుకోవడం వల్ల కొరత ఏర్పడి ఉండవచ్చునని ఆయనే అంటున్నారు. ఆర్బీఐ ధోరణి కూడా ఇందుకు భిన్నంగా లేదు. బ్యాంకుల్లో చాలినంత కరెన్సీ ఉన్నదనీ, అయినా నోట్ల ముద్రణ పెంచామని, రవాణా సమస్య వల్ల కొన్ని ప్రాంతాలలో కొరత ఏర్పడిందని ఆర్‌బీఐ చెబుతున్నది. అసాధారణ స్థాయిలో నోట్ల వినియోగం పెరిగినందువల్ల కొరత ఏర్పడిందనీ, ఐదు వందల రూపాయల నోట్లను ఐదింతలు ఎక్కువగా ముద్రిస్తున్నామ ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్ తెలిపారు. నోట్ల కొరతే లేదని, అటువంటి సమస్య కొన్ని ప్రాంతాలలో తలెత్తడానికి హఠాత్తుగా ప్రజలు పెద్ద ఎత్తున డబ్బు తీసుకోవడమే కారణమని ఈ పెద్దలు అంటున్నారు. నోట్ల కొరత తీర్చడానికి తాము చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్టు నమ్మమంటున్నారు. కానీ వాస్తవం మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నది.

గణాంకాలను తవ్వి తీస్తే, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నోట్ల చెలామణిని తగ్గించిందని రూఢీగా తెలుస్తున్నది. కొంతకాలంగా ఆర్‌బీఐ నోట్ల సరఫరాను తగ్గిస్తూ ఉన్నది. ఆర్‌బీఐ నుం చి తాము కోరిన మేర కనెన్సీ రావడం లేదని బ్యాంకులు లోపాయికారిగా అంగీకరిస్తున్నా యి. పెద్ద నోట్ల రద్దు తర్వాత రోజుకు పది వేల కోట్ల రూపాయల మేర చెలామణిలోకి వచ్చేది. అది క్రమంగా దాదాపు ఐదు వేల కోట్లకు పడిపోయింది. ఇప్పుడు పదిహేను వందల కోట్లకు తగ్గింది. ఇంతగా సరఫరా తగ్గిన తర్వాత నోట్ల కొరత ఏర్పడదా? ఒక సంస్థ సమాచార హక్కు చట్టం ప్రకారం పొందిన వివరాల ప్రకారం- తెలంగాణ రాష్ట్రంలోని ఎస్‌బీఐ శాఖలకు 201 7 సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు నోట్ల సరఫరా మూడో వంతుకు తగ్గిపోయింది. దీన్నిబట్టి నోట్ల కొరతకు ఆర్‌బీఐ సరఫరా తగ్గించడమే కారణమని స్పష్టమవుతున్నది. బ్యాం కుల నుంచి ప్రజలు తీసుకున్న సొమ్మును తిరిగి జమచేయడం లేదనే మాట కూడా వినబడుతున్నది. అయితే దీనికి కారణం కూడా ప్రభుత్వ విధానమే. తాము బ్యాంకులో డబ్బు వేస్తే తిరిగి వస్తుందనే భరోసా ప్రజలకు లేదు. ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేసిన నాటినుంచి గ్రామీణులు చేతిలో రూకలు ఆడక చాలా ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోనూ ఈ సమస్య తలెత్తింది.

కేంద్రం క్రమంగా నోట్ల పాత్ర తగ్గించి, ప్రజలను ఆన్‌లైన్ లావాదేవీల వైపు నడిపిస్తున్నదనే అనుమానాలు ఇప్పుడు మరింతగా వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్ లావాదేవీలను మాత్రమే అమలుచేయడం సాధ్యమా అనే విషయం ఎట్లా ఉన్నా, ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశమే కను క ఉంటే ఆ విషయాన్ని తేటతెల్లంగా చెప్పాలె. ప్రజాస్వామ్య వ్యవస్థలో రహస్య అజెండాలు ఉండకూడదు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా ప్రధాని హఠాత్తుగా ప్రకటించారు. దీనివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు, ఈ చర్య వల్ల నల్లధనం బయటికి వస్తుందని, ఉగ్రవాదుల ఆటకడుతుందని ప్రచారం సాగింది. కానీ ఇదంతా వట్టిదేనని తెలిసిపోయింది. ప్రభుత్వానికి ఉన్న అసలు ఉద్దేశం నోట్ల చెలామణిని తగ్గించడమే. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ ఇప్పుడు నోట్ల సరఫరాను తగ్గిస్తూ కూడా ఆ విషయా న్ని బహిరంగంగా అంగీకరించడంలేదు. కానీ ప్రజలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం నోట్లను తగ్గిస్తున్నదని అనుభవం ద్వారా అర్థమైంది.

ప్రజలు నోట్లను దగ్గర పెట్టుకుంటున్నారనీ, బ్యాంకులలో వేయడం లేదని బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారే అంటున్నారు. దీన్నిబట్టి ప్రజలకు ప్రభుత్వ విధానాలపట్ల భయాందోళనలు నెలకొన్నాయని అర్థమవుతున్నది. ప్రభుత్వ హామీల ను ప్రజలు విశ్వసించడం లేదు. బ్యాకింగ్ వ్యవస్థ మీద కూడా ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతున్నది. ఇది చాలా ప్రమాదకర పరిణామం. కేంద్రం ఇప్పటికైనా నిజాయితీగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలె. నోట్లను తగ్గించుకుంటూ పోయి, ఆన్‌లైన్ లావాదేవీలను మాత్రమే అమలుచేయాలనుకుంటే, దాని సాధ్యాసాధ్యాలను, లాభనష్టాలను నిపుణులతో కమిటీ వేసి అధ్యయనం సాగించాలె. దేశవ్యాప్తంగా వివిధ వేదికలపై విస్తృత చర్చ నడువనీయాలె. పార్లమెంట్‌లో కూలంకషంగా చర్చించి, ఆమోదం పొందాలె. భారీ మార్పు ఏది తలపెట్టినా వ్యూహం రూపొందించుకొని ఆచరణలోకి తేవాలె. దానికి ప్రజామోదం తప్పనిసరిగా ఉండాలె. నిరంకుశ రాజ్యం మాదిరిగా హఠాత్తుగా నిర్ణయాలు ప్రకటించడం కానీ, రహస్య అజెండాలను అమలుచేయడం కానీ తగదు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యంలో సఫలం కావు.

  •  
  •  
  •  
  •  

Comments