రేవంత్ రెడ్డి అక్రమాస్తుల విషయంలో కీలక సాక్ష్యాలు పట్టుకున్న పోలీసులు!

Tuesday, October 2nd, 2018, 01:19:21 PM IST

తెలంగాణలోని ఎన్నికలకు సమయం దగ్గర పడుతుందన్న తరుణంలో ఆదాయాన్ని మించి ఆస్తులు సంపాదించుకున్నాడని అక్కడి కొడంగల్ కాంగ్రెస్ పార్టీ కీలక అభ్యర్థి రేవంత్ రెడ్డి మీద అకస్మాత్తుగా ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసినదే.అయితే గత కొద్దీ రోజులుగా కేసుల నిమిత్తం రేవంత్ రెడ్డి మీద ఐటీ అధికారులు ప్రశ్నలు కురిపించారు.ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి అనుచరుడు అయినటువంటి ఉదయ్ సింహాని కూడా అదుపులోకి తీస్కొని ప్రశ్నించారు.అయితే ఇప్పుడు రాచకొండ పోలీసులు రేవంత్ రెడ్డి అక్రమాస్తుల విషయంలో కీలక సాక్ష్యాలను నిన్న పట్టుకున్నట్టు తెలుస్తుంది.

రేవంత్ రెడ్డి యొక్క అనుచరుడు ఉదయ్ సింహా రేవంత్ రెడ్డి ఆస్తులకు సంబంధించి ఒక హార్డ్ డిస్క్ ను అతని బంధువు అయినటువంటి రణధీర్ కు ఇచ్చినట్టుగా తెలుస్తుంది.అయితే ఐటీ దాడులు జరిగిన రెండు రోజులు నుంచి రణధీర్ పరారీలో ఉన్నాడని,నిన్న రాత్రి ఉప్పల్ లో వాహన తనికీలు చేస్తుండగా అక్కడి పోలీసులు రణధీర్ ను గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అతని దగ్గర ఒక హార్డ్ డిస్క్ మరియు డబ్బు దొరికాయని తెలిపారు.ఈ హార్డ్ డిస్క్ ను ఉదయ్ సింహాయే రణధీర్ కి ఇచ్చినట్టు పోలీసులు తెలియజేసారు.ఇప్పుడు ఆ హార్డ్ డిస్కును డీ కోడ్ చేసి అందులో ఉన్నటువంటి సమాచారాన్ని ఐటీ అధికారులకు పోలీసులు అందజేస్తారని తెలుస్తుంది.