ఇది ఆరంభం మాత్రమే పవన్ !

Sunday, January 14th, 2018, 01:23:51 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అసలు సిసలైన రాజకీయ సెగ మొదలైంది. జరుగుతున్న పరిణామాలని బట్టి నిశితంగా గమనిస్తే ఈ విషయం నిజమే అనే అనుమానాలు కలగక మానదు. ఇన్నిరోజులు పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయం వేరు.. ఇప్పుడు ఎదురుకాబోతున్న సవాళ్లు వేరు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సినీక్రిటిక్ వివాదం మొదలుకుని అనేక అంశాల ప్రాతిపదికగా పవన్ స్థాయిని తగ్గించడానికి తెరవెనుక కుట్రలు మొదలైనట్లు జనసైనికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిగురించి పవన్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. నిన్నమొన్నటి వరకు పవన్ పవన్ కళ్యాన్ తో రాసుకు పూసుకు తిరిగిన మీడియా అధినేతలు ఒక్కసారిగా పవన్ కు యాంటీ గా మారిపోయారనేది పవన్ అభిమానుల వాదన. సినీ క్రిటిక్ వివాదాన్నే దీనికి ఉదాహరణగా చెబుతున్నారు.

టివి ఆన్ చేస్తే చాలు పవన్ పై సినీక్రిటిక్ విమర్శలు, దాని తాలూకు చర్చలతో మీడియాకు ఉన్న మీనింగ్ మార్చేస్తున్నారని విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ విమర్శలన్నీ పట్టించుకోకుండా అత్యధిక టిఆర్పి రేటింగులు కలిగిన మీడియా సంస్థలు, అధికార పార్టీకి చెందిన సంస్థలు కొన్ని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. దీనివెనుక ఉన్న కారణాలని అన్వేషించే పనిలో జనసేన వర్గం ఉన్నట్లు తెలుస్తోంది.

గత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టీడీపీ, బిజెపి కి జై కొట్టి నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబుతో చెలిమి చేస్తున్నారు. 2019 లో ఒంటరిగా వెళ్లాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ లో ఉందనేది వాస్తవం. ప్రత్యేక హోదా నేపథ్యంలో నేరుగా నరేంద్ర మోడీపైనే విమర్శలు మొదలుపెట్టిన పవన్ క్రమంగా టీడీపీకి దూరమయ్యే కారణాలని అన్వేషిస్తునాడు. కాగా 2014 ఎన్నికల నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డిని విమర్శించిన పవన్ ఆ తరువాత వైసిపిని కానీ జగన్ ని కానీ పల్లెత్తు మాట అనలేదు. రాజకీయాలు ఎన్నికలవరకే కావున.. ఏదైనా సమస్య ఉంటె అధికార పార్టీనే అడుగుతూ వచ్చారు.

ఇక ఎన్నికల ఏడాది మాత్రమే సమయం ఉండడంతో ఇటీవల ఉత్తరాంధ్ర నుంచి చలోరే చల్ యాత్రని ప్రారంభించాడు. ఉత్తరాంధ్ర టూర్ వేదికగా మరోమారు జగన్ పై పవన్ విమర్శలు మొదలు పెట్టాడు. ఎలక్షన్ క్యాంపైనింగ్ నేపథ్యంలో అందరిపై తాను అగ్రెసివ్ గా వెళ్లదలుచుకున్నట్లు పవన్ సంకేతాలు ఇచ్చాడు. అదే సమయంలో టీడీపీ చిన బాస్ లోకేష్ పై కూడా సెటైర్లు పేలాయి. పవన్ కళ్యాణ్ ప్రమాద కారిగా మారె అవకాశం ఉండడంతో అన్ని వైపుల నుంచి పవన్ టార్గెట్ గా రాజకీయ వ్యూహాలు మొదలయ్యాయనేది విశ్లేషకుల వాదన. జనసేన పార్టీ కార్యాలయం కు అమరావతిలో మొదలైన అడ్డంకులలో వైసిపి నేత తెరవెనుక ఉండి నడిపించారని టాక్ ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎవరికి వారు అడ్వాంటేజ్ తీసుకుని మీడియా ముసుగులో పవన్ స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ ని ఇది కేవలం ఆరంభం మాత్రమే అని భవిషత్తులో ఇలాంటి ముళ్ల బాటలు పవన్ కు చాలా ఎదురుకానున్నాయని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు.