‘ఎన్టీఆర్’ను రెండుగా విడగొట్టడంలో పొలిటికల్ ప్రెజర్ !

Friday, October 5th, 2018, 09:00:12 AM IST

బాలక్రిష్ణ చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ పై అందరిలోను సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో చోటు చేసుకున్న వెన్నుపోట్లు, చీకటి కోణాలను చూపిస్తారా చూపించరా అనే ఆసక్తి నెలకొని ఉంది. ఈ క్రమంలోనే మేకర్స్ ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి జీవితాన్ని రెండున్నర గంటల్లో చూపడం సాధ్యం కావడంలేదని అందుకే రెండు భాగాలుగా చేస్తున్నామని ప్రకటించారు.

వీటిలో మొదటి భాగం ‘కథానాయకుడు’లో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని చూపిస్తారట. రెండో భాగం ‘మహానాయకుడు’లో ఆయన రాజకీయ జీవితాన్ని ఆవిష్కరిస్తారట. అయితే ఈ 2వ భాగం ఏపీ ఎన్నికల తర్వాతే వస్తుందని తెలుస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ పొలిటికల్ జీవితంలో చంద్రబాబు నాయుడి పాత్ర చాలా విమర్శలతో, ఆరోపణలో కూడుకున్నది. బాబుపై మామని వెన్నుపోటు పొడిచి పార్టీని, పదవిని దక్కించుకున్నాడనే ఆరోపణ ఇప్పటికీ పచ్చిగానే ఉంది.

అందుకే ఎన్నికల ముందు ఆ ఉదంతాల్ని ప్రజలకి గుర్తుచేసి నష్టాన్ని కొని తెచ్చుకోవడం ఎందుకనే ఉద్దేశ్యంతో సినిమాను రెండు ముక్కలు చేసి వివాదాల్లేని మొదటి భాగాన్ని ఎన్నికల ముందు 2వ బన్నీ ఎన్నికల తరవాత ఎప్పుడైనా చేసుకోమని బాబు బాలయ్యకు సలహా ఇచ్చారని, వియ్యంకుడి సలహాను బాలయ్య కూడ తూ.చా తప్పకుండా పాటిస్తున్నారని టాక్.