పొలిటికల్ వార్ : అక్కడ మెగా బ్రదర్స్ పోటాపోటీ ప్రచారం…

Sunday, April 8th, 2018, 11:07:30 AM IST

ప్రస్తుతం మెగా ఫామిలీ లో ఒక ఆసక్తికర పోరు జరగనుంది. అయితే అది సినిమాల విషయంలో కాదులెండి. రాజకీయ ప్రచారం విషయంలో. వచ్చే నెలలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, కాంగ్రెస్ తరఫున చిరంజీవి ప్రచారం చేయనున్నారన్న విషయం ఇప్పటికే ఖరారు అయిన విషయం తెలిసిందే. మరోవైపు తన మిత్రుడు జేడీ (ఎస్) నేత కుమారస్వామి కోరిక మేరకు, ఆయన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. దీంతో కన్నడ నాట మెగా బ్రదర్స్ మధ్య ప్రచార పోరు తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ ఏకంగా మూడు వారాల పాటు రాష్ట్రంలో మకాం వేసి, కొన్నాళ్లుగా సభలు , సమావేశాలలో ప్రసంగాలు చేస్తున్నారు.

అలానే బీజేపీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగి పర్యటనలు సాగిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి తన కొత్త సినిమా ‘సైరా’ షూటింగ్ లో బిజీగా ఉండగా, ఇటీవలే పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కల్యాణ్, ఏపీకి హోదా కోసం ఉద్యమిస్తున్నారు. ఇక కర్ణాటక ఎన్నికలు జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారగా, ఈ పోరును అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కర్ణాటకలో దూరమైన అధికారాన్ని తిరిగి సాధించుకునే యత్నాల్లో బీజేపీ ఉండగా, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న కృత నిశ్చయంతో సిద్ధరామయ్య దూసుకెళుతున్నారు. ఇటీవలి ఎగ్జిట్ పోల్స్ కొంతవరకు కాంగ్రెస్ కు అనుకూలంగా వున్నాయి.

అయితే ఎన్నికలకు మరో నెల రోజుల సమయం ఉండటంతో ఏదైనా జరగవచ్చు. ఈ మేరకు కాంగ్రెస్ తరఫున చిరంజీవి ప్రచారానికి షెడ్యూల్ కూడా ఖరారైనట్టు సమాచారం. ఈ నెల ఆఖరు వారంలో ఆయన పర్యటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. పవన్ ప్రచారంపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఆయన జేడీ (ఎస్) తరఫున సరిహద్దు జిల్లాల్లో ప్రచారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే కర్ణాటక కేంద్రంగా మెగా బ్రదర్స్ మధ్య జరిగే తొలి పొలిటికల్ వార్ ఇదే అవుతుందనడంలో సందేహం లేదు. మరి ఈ అన్నదమ్ముల సవాల్లో ఎవరు మద్దతు ఇచ్చిన పార్టీ గెలుస్తుందో అని అక్కడి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు….