ప్రగతి నివేదన సభ ఒక అట్టర్ ఫ్లాప్ షో!

Monday, September 3rd, 2018, 01:47:27 PM IST

టిఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన సభ అనుకున్న దానికంటే కూడా ఎంతో విజయవంతమైందని, ప్రజలనుండి వచ్చిన ఈ అపూర్వస్పందనతో తమ పార్టీ శ్రేణులు ఎంతో ఆనందంతో నిండిపోయాయని టిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ నిన్న సభావేదికపై సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కూడా ఇక్కడికి తరలి వచ్చిన జనవాహినిని చూస్తుంటే, నిజంగా కన్నులకు పండుగలా ఉందని, తమ పార్టీపై ప్రజలు ఇంతలా ఆదరాభిమానాలు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు అని మాట్లాడారు. ఈ సభతో ప్రతిపక్షాల వెన్నులో వణుకుపుడుతోందని, సభ సక్సెస్ అయినందువల్ల తమ పార్టీ రాబోయే ఎన్నికల్లో మళ్ళి విజయాన్ని చేజిక్కించుకోవడం ఖాయమని వారు భయపడుతున్నారని అన్నారు. అయితే ప్రగతి నివేదన సభ పెట్టి టిఆర్ఎస్ తమ స్థాయి మరియు విలువను దిగజార్చుకుందని, సభకు అనుకున్నంతమంది ప్రజలు రాక సభ ప్రాంగణం వెలవెలపోయిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ మాట్లాడుతూ,

ప్రగతి నివేదన సభ ఒక అట్టర్ ఫ్లాప్ షో అని, సభ కోసం టిఆర్ఎస్ పార్టీ ఖర్చు చేసిన రూ.300 కోట్ల రూపాయలు వృధా అయ్యాయని విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీ చెపుతున్నట్లు సభకు వచ్చిన జనం చాలా తక్కువని, కేవలం 2 నుండి 3 లక్షల మంది మాత్రమే సభకు హాజరయ్యారని అన్నారు. కేసీఆర్ సభలో ప్రసంగిస్తున్నప్పుడు సభలోని వారు ఎవరు కూడా పెద్దగా ఆసక్తి వ్యక్తం చేయలేదని అన్నారు. ఇటువంటి ఫ్లాప్ షో గురించి టిఆర్ఎస్ నాయకులు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని విమర్శించారు. అసలు సభలో ప్రసంగించిన టిఆర్ఎస్ నాయకులు అన్ని పధకాలను ప్రస్తావించినప్పటికీ, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మరియు మూడెకరాల భూమి పధకాల గురించి మాత్రం ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని అన్నారు. కేసీఆర్ కు సభ ఫ్లాప్ కావడంతో లోలోపల ఆందోళన మొదలయిందని, రాబోయే ఎన్నికలపై కూడా ఆ పార్టీ కొంత ఆలోచనలో పడ్డట్లు షబ్బీర్ అలీ విమర్శించారు……

  •  
  •  
  •  
  •  

Comments