ఈమె దృష్టిలో గాంధీని చంపిన గాడ్సే గొప్ప దేశభక్తుడట !

Friday, May 17th, 2019, 02:20:38 PM IST

మక్కల్ నీధి మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ గాంధీని చంపిన గాడ్సేనే దేశపు తొలి ఉగ్రవాది అని, అతనొక హిందువని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపడమే కాకుండా కొంతమంది నేతల్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. కమల్ వ్యాఖ్యల్ని ఖండించాలనుకున్న చాకచక్యం కలిగిన నేతలు ఆయన వ్యాఖ్యల్లో గాడ్సే దేశ ద్రోహా కాదా అనే ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించకుండా తొలి ఉగ్రవాది హిందువే అనడం సమంజసం కాదని వ్యతిరేకత వ్యక్తం చేస్తే భోపాల్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మాత్రం ఆవేశంతో మాట్లాడి అడ్డంగా దొరికిపోయారు.

ఒక మీడియా ఛానల్‌తో మాట్లాడిన ఆమె గాడ్సే గొప్ప దేశభక్తుడని, ఆయన్ను విమర్శించేవారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని గొప్పగా సెలవిచ్చారు. గాడ్సే దేశభక్తుడైతే అతని చేతిలో చంపబడ్డ గాంధీ దేశద్రోహా అంటూ రాజకీయ నాయకులే కాదు సామాన్య జనం సైతం ప్రజ్ఞాపై మండిపడుతున్నారు. సున్నితమైన అంశంలో ప్రజ్ఞా సింగ్ ఇలా నోరు జారడంతో బీజేపీ నేతలు సైతం తలలుపట్టుకున్నారు. ఈ విషయమై అధిష్టానం నుండి ఆమెకు మొట్టికాయలు కూడా పడ్డాయట. దీంతో ఆమె ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిగతమని, నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు.