మెగాస్టార్ సీనే రిపీట్ అవుతుందా..సర్వే తేల్చిన లెక్క..!

Thursday, January 18th, 2018, 03:51:20 AM IST

సినీ నటులు రాజకీయాల్లోకి వస్తే మీడియాలో ఉండే హడావిడే వేరు. ఆ హడావిడి చూసి ప్రొఫెషనల్ రాజకీయం నేతలు కలవర పాడడం కూడా సహజమే. ఎంజీఆర్, ఎన్టీఆర్ మరియు జయలలిత తరహాలో రాజకీయాల్లో విజయం సాధించిన సినీనటులు ఇప్పట్లో లేరు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. కులం వర్గం మరియి మతం ప్రాతిపదికన అనేక పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. స్టార్ ఇమేజ్ ఉన్న నటులు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ప్రజలు వారినుంచి సాంప్రదాయ పార్టీలకు భిన్నంగా రాజకీయం ఆశిస్తారు. అది సాధ్యం కాక చతికలబడ్డ సందర్భాలు ఉన్నాయ్.

ప్రస్తుతం రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ దేశ రాజకీయాలని కుదిపేస్తోంది. రజినీకాంత్ తమిళరాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయం అని రాజకీయ పండితులు బలంగా విశ్వసిస్తున్న తరుణంలో ఓ రహస్యంగా నిర్వహించిన సర్వే సూపర్ స్టార్ ఫాన్స్ ని కలవరపెడుతోంది. సర్వే వివరాలని బట్టి చూస్తే అప్పటి సమైఖ్య ఆంధ్రలో ప్రజారాజ్యం పార్టీ సీన్ రిపీట్ అవుతుందని ఈ సర్వేని బట్టి తేలింది. జయలలిత మరణం తరువాత అన్నా డీఎంకే పార్టీ బలహీన పడ్డ మాట వాస్తవం. కానీ ఆ పార్టీ మూలాలు అయితే చెడిపోలేదు. ఆ పార్టీకి ఉండే బేసిక్ ఓటు బ్యాంకు పదిలం అని సర్వే తేల్చింది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ 130 వరకు సీట్లతో అధికారంలోకి రావడం ఖాయం అని సర్వే తేల్చింది. ఇక అన్నాడీఎంకే పార్టీ 60 సీట్లవరకు సాధిస్తుందట. రజినీకాంత్ కు కేవలం 30 స్థానాలు మాత్రమే దక్కుతాయని సర్వే వివరాలు తెలుపుతున్నాయి.

లేటు వయసులో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన రజినీకాంత్ పై ఆయన అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా రజిని అవతరించడం ఖాయంని ఆయన ఫాన్స్ ధీమాతో ఉన్నారు. ఇప్పటికిప్పుడు తమిళనాడులో ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది అనే ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించారట. రజినీకాంత్ అవలంభించబోయే రాజకీయ విధానాలపై ఆయన స్థాపించబోయే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తేల్చారు. ఈ సర్వేలో కమల్ హాసన్ రాజకీయాల గురించి కూడా వ్యాఖ్యానించారు. కమల్ పార్టీ పెడితే ఒక్క సీటు కూడా దక్కడం కష్టమే అని అంటున్నారు.