ప్రణయ్ కు విగ్రహమా.. ఎందుకు ?

Monday, September 24th, 2018, 05:04:43 PM IST

మిర్యాలగూఢలో జరిగిన ప్రణయ్ పరువు హత్య జనాల్లోకి నానా రకాలుగా వెళుతోంది. ఆరంభంలో పరువు కోసం ఒక ప్రాణం తీయడమేమిటని రాష్ట్రం మొత్తం అమృతకు సపోర్ట్ చేస్తూ ఆమె తండ్రి మారుతీ రావు చర్యను ఖందించారు. పోలీసులు కూడ కేసు నమోదు చేసుకుని నిందితులకి శిక్షపడేలా చేస్తామని హామీ ఇచ్చారు. అంతటితో కథ ముగిసిపోయి ఉంటే బాగుండేది.

కానీ మీడియా ఛానెళ్లు టీఆర్ఫీల దాహంతో జనాలకు ఊపిరి తీసుకునే వీలు కూడా లేకుండా ఈ ఉదంతాన్ని ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రెజెంట్ చేశారు. మొత్తానికి రెండు కుటుంబాల గొడవను దేశ సమస్యగా మార్చేశారు. ప్రేమను వ్యతిరేకించే తల్లిదండ్రులందర్నీ ద్రోహులుగా చిత్రీకరించేశారు. ఇక అమృత కూడ భర్త మరణించాడనే బాధలో తనను ఓదార్చడానికి వచ్చిన రాజకీయ నాయకుల్ని మిర్యాలగూఢలో ప్రణయ్ విగ్రహం పెట్టాలని కోరింది.

మన పోలీటీషియన్లు వెనక ముందు ఆలోచించకుండా, విగ్రహం అనేది సమాజ శ్రేయస్సుకు, అభివృద్ధికి పాటు పడిన వాళ్లకు మాత్రమే పెడతారని, ఆ లెక్కలు వేరుగా ఉంటాయని ఆమెకు నచ్చజెప్పాకుండా కాంస్య విగ్రహాన్ని చేయిస్తామని హామీ ఇచ్చేశారు. ఇలాంటి పరువు హత్యల్ని ఆపాలనే ఉద్దేశ్యమే నిజంగా వారికి ఉంటే మార్పు కోసం మీటింగులు పెట్టి ప్రసంగాలు చేయాలి లేదా కుల నిర్మూలన సంఘాల్ని పెట్టి జనాల్ని చైతన్యవంతుల్ని చేయాలి. అంతేకానీ ఇలా విగ్రహాలు, అసెంబ్లీ సీట్ల హామీలు ఇవ్వడం ఏమిటి.

మీడియా అతిని పక్కనబెట్టి, సమస్య మూలాల్ని గురించి ఆలోచిస్తే హత్య చేయడం నేరం, అమృతకు జరిగింది అన్యాయమే. ఆమె తండ్రి మారుతిరావుకి శిక్ష పడాల్సిందే కానీ ప్రణయ్ కు విగ్రహం ఎందుకు. విగ్రహం అనేది దేశం కోసం చనిపోయిన సైనికులకు, జనాలకు సేవ చేసిన రాజకీయవేత్తాలకు, సంఘసంస్కర్తలకు, ఏదైనా రంగంలో ఎనలేని సేవలందించిన ప్రతిభావంతులకు ఇచ్చే గౌరవం. అలాంటి విగ్రహం ప్రణయ్ కు పెట్టడమనేది ఎంతమాత్రమూ కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో సైతం ఇలాంటి అభిప్రాయాలే వెల్లడవుతున్నాయి. బాధితులు అమృత, ప్రణయ్ తల్లిదండ్రులకు పోలీస్ శాఖ చేయాల్సిన న్యాయం మారుతీరావుకు శిక్ష పడేలా చేయడం, ఇక సమాజం, నాయకులు తమ వంతుగా వాళ్లకు మనోస్థైర్యాన్ని చెప్పి, అమృత యొక్క తదుపరి కార్యాచరణకు సలహాలు, సూచనలు ఇచ్చి, సహాయం చేయడం. అంతేకానీ ఈ విగ్రహాలు పెట్టడం లాంటి అసందర్భపు, అనసరపు చర్యల్ని విరమించుకుంటే మంచింది.