బిగ్ ఫైట్.. బిగ్ న్యూస్.. ప్రత్తిపాడు నుండి వైసీపీ టికెట్ అత‌నికేనా..?

Tuesday, October 9th, 2018, 03:50:19 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల హ‌డావుడి ఊపందుకుంది. తెలంగాణ‌లో ఇప్ప‌టికే ఎన్నిక‌ల న‌గార మోగ‌గా, ఏపీలో కూడా దాదాపుగా ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. అందులో భాగంగానే అధికార టీడీపీ.. ప్ర‌తిప‌క్ష వైసీపీ నువ్వా-నేనా అన్న‌ట్టు త‌ల‌ప‌డేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇక గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చిన జ‌న‌సేన కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో బ‌రిలోకి దిగ‌నున్నామ‌ని ప్ర‌క‌టించేసంది. దీంతో ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా జరుగ‌నున్నాయని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా పాద‌యాత్ర చేస్తూ రాష్ట్రంలో ఉన్న జిల్లాల‌న్నీ చుట్టేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వ‌డ‌మే కాకుండా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఆయా సెగ్మెంట్ల‌లో వైసీపీ త‌రుపున అభ్యర్ధుల‌ను కూడా నియ‌మించుకునే ప‌నిలో కూడా ఉన్నారు. అందులో భాగంగానే తూ.గో.జీలోని ప్ర‌త్తిపాడు నియోజ‌కవ‌ర్గంలో వైసీపీ త‌రుపున‌ అభ్య‌ర్ధిని కూడా ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది.

తాజాగా ప్ర‌త్తిపాడులోని కార్య‌క‌ర్త‌ల‌తో బూత్‌లెవ‌ల్ క‌మిటీ స‌భ్యుల‌తో స‌మావేశం ఏర్పాటుచేసిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, బీవీఆర్‌ చౌదరి, కుమార్‌ రాజా, అలమండ చలమయ్య స్థానిక నాయకులు రాయవరపు భాస్కరరావు, కొండపల్లి అప్పారావు, బీఎస్‌వీప్రసాద్‌, కొల్లు చిన్నా తదితరులు పాల్గొన్నారు. అయితే స‌మావేశంలో భాగంగా వైసీపీ ముఖ్య‌నేత ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎన్నిక‌ల‌కోసం మ‌నం గ‌ట్టిగా క‌ష్ట‌ప‌డాల‌ని.. ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో ఇంచార్జిగా ఉన్న ప‌ర్వ‌త పూర్ణ‌చంద్ర‌రావు వైసీపీ పార్టీని ప‌టిష్ట‌ప‌ర్చేందుకు తీవ్రంగా కృషి చేశార‌ని.. ఈ నేప‌ధ్యంలో ప‌ర్వ‌త పూర్ణ‌చంద్ర‌రావు నేతృత్వంలోనే రానున్న‌ ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధం కావాల‌ని పిలుపునిచ్చారు. దీంతో ప్ర‌త్తిపాడు నుండి వైసీపీ టికెట్ క‌న్ఫాం అయిపోయింద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.