పీఆర్సీ పైన భాద్యత తీస్కున్నాం..

Saturday, May 5th, 2018, 10:01:00 AM IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్థికమంత్రి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన మంత్రుల సబ్‌కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. సమస్యలన్నింటికీ పరిష్కారాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. శనివారం ఉపాధ్యాయసంఘాలతో కూడా చర్చించి, అన్ని డిమాండ్లతో నివేదిక రూపొందించి అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు అందచేస్తామని చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు మంత్రులు ఈటల, కే తారకరామారావు, జీ జగదీశ్‌రెడ్డితో ముఖ్యమంత్రి ఏర్పాటుచేసిన ఉపసంఘం శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలోని ఆర్థికమంత్రి చాంబర్‌లో ఉద్యోగసంఘాల ప్రతినిధులతో సమావేశమైంది. సుమారు రెండున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో అన్ని అంశాలపై సుదీర్ఘంగా, కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశంలో ఉద్యోగులు ప్రతిపాదించిన 18 డిమాండ్లపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. పీఆర్సీ అనేది తమ బాధ్యతని, దీనిపై ఎలాంటి అపోహలు అవసరం లేదని మంత్రులు స్పష్టంచేశారని సమాచారం. అనంతరం ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ వివరాలను తెలియజేశారు. శనివారం ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కూడా సమావేశమై, అనంతరం నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేస్తామని చెప్పారు. అంతకుముందు జరిగిన సమావేశంలో ఉద్యోగసంఘాల నాయకులకు మంత్రులు పూర్తి భరోసానిచ్చారని సమాచారం. ఉద్యోగులు, తెలంగాణ ప్రభుత్వం వేర్వేరు కాదు. మనమంతా ఒక్కటే అని వారు చెప్పారని తెలిసింది. ఉద్యమకాలం నుంచి రాష్ట్రం సాధించుకునేవరకు, తదుపరి గడిచిన నాలుగేండ్లలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని, ఇప్పుడు కూడా ఉద్యోగుల పక్షపాతంగానే వ్యవహరిస్తామని మంత్రుల కమిటీ సభ్యులు స్పష్టంచేశారని సమాచారం. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉద్యోగుల కోరికలు ప్రభుత్వాలు తీర్చలేని గొంతెమ్మ కోరికలు ఏమీకావని, ఎన్ని చేయగలమో అన్నీచేస్తామని స్పష్టంచేశారని సమాచారం.

శనివారం ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో కూడా చర్చిస్తామని, అనంతరం అన్ని విషయాలను సీఎం కేసీఆర్‌కు వివరిస్తామని తెలిపారు. వాటిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఉద్యోగులతో ముఖ్యమంత్రి స్వయంగా సమావేశమయ్యే అవకాశం కూడా ఉందని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారని సమాచారం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మీరు (ఉద్యోగులు), మేము (మంత్రులు) కలిసి పనిచేశాం. రాష్ట్రం వచ్చిన తరువాత బంగారు తెలంగాణ నిర్మాణంకోసం కలిసి పనిచేస్తున్నాం. పొరపాటున కూడా మేము వేరు.. మీరు వేరు అనే భావన రాకూడదు అని ఆయన చెప్పారని తెలిసింది. వందరోజుల్లో రెవెన్యూ అధికారులు, సిబ్బంది కష్టపడి భూ రికార్డుల ప్రక్షాళన బ్రహ్మాండంగా చేశారని మంత్రులు కొనియాడారు. సాగునీటిపారుదలశాఖ అధికారులు బాగా పనిచేస్తున్నారని, అందుకే ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా నడుస్తున్నదని అన్నారు. ఇలా ఉద్యోగులంతా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. మిషన్‌భగీరథ అనుకున్నదానికంటే వేగంగా నడుస్తున్నదని, పురపాలనలో 15 రోజుల్లోనే అనుమతులు వస్తున్నాయని, పరిశ్రమలకు 15 రోజుల్లోగా అనుమతులు వస్తున్నాయని చెప్తూ.. ఇవన్నీ ఉద్యోగులు పనిచేయడం వల్లనే సాధ్యమవుతున్నాయని మంత్రులు చెప్పారని సమాచారం. కొత్త రాష్ట్రం కావడంతో ఒకవైపు తమపైన, మరోవైపు ఉద్యోగులపై కూడా కొంత ఒత్తిడి ఉన్నదన్నారు. బదిలీలు, పదోన్నతుల గురించి మాట్లాడుతూ, గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.