బాబు మెడ‌కు గుదిబండ‌లా `ప్రొద్దుటూరు`!

Saturday, October 6th, 2018, 03:08:07 AM IST


ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ తేదేపా అధినాయ‌కుడికి వ‌రుస త‌ల‌నొప్పులు బొప్పి క‌ట్టిస్తున్నాయి. ఓవైపు మోదీ-కేసీఆర్ బృందం త‌న‌పై క‌త్తిగ‌ట్టి ఎటాక్ చేస్తున్న వేళ పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు పుండు మీద కారం చ‌ల్లుతోంద‌న్న మాట వినిపిస్తోంది. ఫిరాయింపు రాజ‌కీయాల్ని ప్రోత్స‌హించ‌డం త‌న మెడ‌కే చుట్టుకోవ‌డం బాబులో క‌ల‌వ‌ర‌పాటుకు కార‌ణ‌మ‌వుతోంది. జ‌గ‌న్ సొంత ఇలాకాలో కుంప‌టి పెట్టాల‌నుకున్నా.. అక్క‌డ తేదేపాలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, ఆధిప‌త్య పోరు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది.

అదే తీరుగా తాజాగా ప్రొద్దుటూరు టీడీపీలో వ‌ర్గ‌విబేధాలు తారా స్థాయికి చేరాయి. ఈ నియోజ‌క వ‌ర్గంలో పార్టీ నాయ‌కులు ఉప్పు నిప్పులా ఒక‌రిపై ఒక‌రు ర‌గిలిపోతున్నారు. ఎంపీ సీఎం రమేష్, మాజీఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఆ ఇరువురూ బ‌హిరంగంగానే బాహాబాహీకి దిగుతున్నారు. ఇటీవ‌లే ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 22 మంది కౌన్సిలర్లు రాజీనామా వ్యవహారంపై సీఎం ర‌మేష్‌పై వ‌ర‌ద‌రాజులు ఫైరైపోయారు. ప్రొద్దుటూరు రాజ‌కీయాల్లో అత‌డిని లేకుండా చేస్తాన‌ని హెచ్చ‌రించారు. అయితే ఈ విభేధాల వ‌ల్ల త‌న‌కు త‌ల బొప్పి క‌ట్టేస్తుండ‌డంతో బాబు నేరుగా బ‌రిలో దిగి చ‌ల్లార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. ఈ శ‌నివారం ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స‌ఖ్య‌త కోసం భేటీకి పిలిచార‌ని తెలుస్తోంది. ఈ విభేధాల‌పై బాబు చాలా సీరియ‌స్‌గా హెచ్చరించార‌ని తెలిసింది.