కోందండరాం.. కేరాఫ్ కమిట్మెంట్ !

Friday, September 21st, 2018, 12:55:42 PM IST

తెలంగాణ ఉద్యమ సమయంలో తన సలహాలు సూచనలతో కేసిఆర్ కు గైడెన్స్ ఇచ్చి ప్రసంగాలతో ప్రజల్ని ఉద్యమంలో భాగస్వాముల్ని చేసిన కోదండరాం తెరాస ప్రభుత్వ ఏర్పడిన తర్వాత కేసిఆర్ తో పొసగక టిజెఎస్ పేరుతో వేరు కుంపటి పెట్టి ఇప్పుడు మహాకూటమితో చేతులు కలిపి రాబోయే ముందస్తు ఎన్నికల్లో కేసిఆర్ ను గద్దె దింపాలని ప్రయత్నిస్తున్నారు.

ఇన్ని రోజులు కేసిఆర్ పై హద్దులు దాటకుండా విమర్శలు చేస్తూ వచ్చిన ఆయన ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మాటల్లో వేడి, చేతల్లో వాడి పెంచారు. నాలుగేళ్ల క్రితం కోదండరాంకు ఇప్పుడున్న కోదండరాంకు చాలా తేడా కనిపిస్తోంది. ఉద్యమ నాయకుడి నుండి రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందారాయన. తమకు కూడ రాజకీయ శక్తిగా మారాల్సిన అవసరం వచ్చిందంటున్న ఆయన మహాకూటమిలో చేరినంత మాత్రన తమకు ఎదిగే శక్తిలేదని కాదని స్పష్టం చేశారు.

ఆయన మాటల్లో వాస్తవం లేకపోలేదు. అధికారంలోకి వచ్చాక కేసిఆర్ పెట్టుకున్న ఎజెండాల్లో శత్రుత్వం లేకుండా చేసుకోవాలనేది కూడ ఒకటి. ఆ ప్రకారమే చాలా పార్టీల్ని నయానో భయానో నిర్వీర్యం చేసేశారు కూడ. కానీ కోదండరాంను మాత్రం పెద్దగా కదిలించలేకపోయారు. కొత్త పార్టీని పెట్టినప్పుడు ఈయనా కేసీఆర్ ముందు నిలబడగలిగేది అన్నట్టు కనిపించినా కాలక్రమేణా సున్నిత నైజాన్ని మార్చుకుని అన్ని ఆటుపోట్లకు అలవాటుపడుతూ వచ్చారు. అందుకు కారణం ఆయనలోని బలమైన కమిట్మెంటే అని చెప్పాలి. ఉద్యమ ఫలితాన్ని వ్యక్తిగతం చేసుకున్న కేసిఆర్ ప్రజల మనోగతాన్ని పట్టించుకోకుండా పనిచేస్తున్నారని, జనాలకు మాట్లాడే పరిస్థితి కూడ లేదని, జనాలకు పైసలిచ్చేటోడు కాదు సమస్యల్ని పరిష్కరించేటోడు కావలి అంటూ ఈ పరిస్థితిని మారుస్తాం అంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

ముందస్తు అనేది కేసీఆర్ అవివేకానికి నిదర్శనమని, దీని వలన ఆయనతో పాటు పార్టీ కూడ మునగడం ఖాయమంటూనే టిజెసిని తాము గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టం చేసే ప్రయత్నంలో విజయం సాదిస్తున్నామని ఆధారాలు కూడ చూపిస్తున్నారు. కోదండరాం నోటి వెంట వస్తున్న ఈ మాటల్ని, విమర్శల్ని వింటుంటే ప్రొఫెసర్ ను పరిస్థితులు ఎంతలా రాటుదేల్చాయో కళ్ళకు కడుతోంది.