వీడిన గ్రహణం.. అంబటి రాయుడి అరంగేట్రం

Thursday, July 25th, 2013, 01:08:10 PM IST

ambati rayadu
ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడుకు ఎట్టకేలకు భారత తుది జట్టులో ఆడే అవకాశం దక్కింది. జింబాబ్వేతో బుధవారం జరిగిన తొలి వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతను అజేయంగా 63 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2001లోనే తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన అతనికి 27 ఏళ్ల 10 నెలల వయసులో భారత్ తరఫున మొదటి అవకాశం దక్కింది.అతని కెప్టెన్సీలో ఆడిన ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్‌లు భారత్‌కు ఎంపికైనా రాయుడికి మాత్రం అవకాశం రాలేదు. అతని కంటే జూనియర్లు అయిన ధోనీ,కోహ్లిలు జట్టు లో స్థిర పడగా అతను మాత్రం సెలక్టర్లను ఆకట్టుకోలేకపోయాడు. అపార ప్రతిభ,అద్భుతమైన స్ట్రోక్ మేకర్,సచిన్ స్థాయికి ఎదిగే సత్తా ఉన్నవాడు ఇలాంటి అపరిమిత ఉపమానాలెన్నో రాయుడు గురించి ఎన్నో సార్లు వినిపించాయి. కానీ భారత్‌కు ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. స్వయంకృతానికి తోడు కొన్నిసార్లు అదృష్టం కూడా అతడిని ఆమడ దూరం పెట్టేసింది.పరిస్థితులు అనుకూలించనప్పుడు ఎంత ప్రతిబ ఉన్నా.. పలితం ఉండదనడానికి రాయుడు కెరీర్ నిదర్శనం.ఐసీఎల్‌తో ఒక దశలో ముగిసినట్లు కనిపించిన కెరీర్,ఆ తర్వాత ఐపీఎల్‌తో మళ్లీ ఊపిరి పోసుకోవడం,రంజీ ట్రోఫీలో జట్లు మారడం, చివరికి భారత్‌కు ఆడే అవకాశం. ఇలా అతని కెరీర్‌లో అనూహ్య మలుపులెన్నో ఉన్నాయి.2010 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడటం రాయుడు కెరీర్‌ను మళ్లీ బతికించింది. సచిన్ సాహచర్యం అతడిని రాటుదేల్చింది. సన్నిహితుల సలహాపై హైదరాబాద్‌ను వదిలి దేశవాళీలో బరోడా జట్టుకు మారడం కూడా కలిసొచ్చింది. గత మూడేళ్లుగా బరోడా జట్టు తరఫున భారీగా పరుగులు సాధించడం జాతీయ జట్టుకు దగ్గర చేసింది. ఇప్పుడు తనకి ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న రాయుడు తన లక్ష్యాన్ని నెరవెర్చుకున్నాడు.