సంపద ప్రజలందరికీ అందేలా చూడాలి : కేసీఆర్

Sunday, June 3rd, 2018, 09:45:56 AM IST

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిన్న సికింద్రాబాద్ లోని పెరేడ్ మైదానంలో అవతరణ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఎందరో అమరవీరుల, త్యాగధనుల ఫలితమే మన తెలంగాణ రాష్ట్రమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఎన్నో దుష్ట శక్తులు మా ప్రయత్నాల్ని అడ్డుకోవాలని చూశాయని, కానీ వారి దుష్ట ప్రయత్నాన్ని గట్టిగా ప్రతిఘటించామని ఆయన అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 40 వేల కోట్లతో 40 రకాల ప్రజా సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని ఆయన స్పష్టం చేసారు. ఇక 21శాతం ఆదాయ వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన చెప్పారు. ఇప్పటికే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, బాలింతలకు కేసీఆర్ కిట్ వంటి పధకాలు ప్రజల వద్దకు బాగా చేరువయ్యాయని, రానున్న రోజుల్లో ఈ పధకాలను మరింత ముందుకు తీసుకుళ్తామంన్నారు.

ఇక దేశానికి వెన్నెముక వంటి అన్నం పెట్టె రైతన్న బాగుండాలని తలచి రైతులకు ఎకరాకు రూ.8000 రూపాయలు పంట పెట్టుబడికింద ఇస్తున్నామని, ఇక రానున్న ఈ కొద్దిరోజుల్లో రైతుసోదరులు మరణాంతరం కూడా వారి కుటుంబాలకు ఎటువంటి ఆర్ధిక ఇబ్బంది లేకుండా చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశంతో వారికి భీమా కూడా ప్రవేశ పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. అలానే వ్యవసాయాన్ని ఉపాధి హామీతో జతచేసి అన్నిపంటలకు తగిన మద్దతు ధర ప్రకటించేలా కేంద్రం పై ఒత్తిడి తీసుకువస్తాం అన్నారు. అంతేకాదు సంపదను ప్రజలందరికీ సక్రమంగా అందేలా చోడటమే ప్రభుత్వ బాధ్యత అని, అప్పుడే రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో తాము చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలతోనే ముందుకు వెళతామని, ప్రజలందరి మద్దతుతో మరొకసారి విజయబావుటా ఎగరవేస్తామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు…..

  •  
  •  
  •  
  •  

Comments