తెలంగాణ కాంగ్రెస్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

Tuesday, April 23rd, 2019, 07:11:22 PM IST

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావుపై సీఎల్పీ లీడ‌ర్ భ‌ట్టి విక్ర‌మార్క తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. కాగా, కాంగ్రెస్ నుంచి తాజాగా టీఆర్ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై ఫిర్యాదు చేసేందుకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ‌లో అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డిని ఆయ‌న క‌లిశారు. ఆయ‌న‌తోపాటు కాంగ్రెస్ నేత ష‌బ్బీర్ అలీ కూడా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలంద‌రిపై అన‌ర్హ‌త వేటు వేయాలని పేర్కొంటూ స్పీక‌ర్‌కు లేఖ‌ను అంద‌జేశారు.

అనంత‌రం భ‌ట్టి విక్ర‌మార్క మీడియాతో మాట్లాడుతూ, ఇప్ప‌టికే ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై ఫిర్యాదు చేశామ‌ని, సీఎల్పీని టీఆర్ఎల్పీలో విలీనం చేసుకునేలా అధికార పార్టీ వ్య‌వ‌హ‌రించ‌డం రాజ్యాంగ విరుద్ద‌మ‌న్నారు. అధికార పార్టీ రాజ్యాంగానికి విరుద్దంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని భ‌ట్టి విక్ర‌మార్క మండిప‌డ్డారు. ఒక పార్టీ టికెట్‌పై గెలుపొంది మ‌రోపార్టీలో చేర‌డం క్విడ్ ప్రోక్రో కింద‌కు వ‌స్తుంద‌న్నారు.

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన వారంతా వారి వారి ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయాల‌ని భ‌ట్టి విక్ర‌మార్క డిమాండ్ చేశారు. ప్ర‌జాస్వామ్య‌బ‌ద్దంగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్నా గ‌వ‌ర్న‌ర్ స్పందించ‌క‌పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఇదే విష‌య‌మై కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌జా ప‌రిర‌క్ష‌ణ యాత్ర చేప‌డ‌తామ‌ని, అది కూడా పిన‌పాక నుంచి ఈ యాత్ర‌ను ప్రారంభించ‌నున్న‌ట్టు భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.