తొలి పరుగు కోసం 50 బంతులు ఆరగించేసిన పుజారా..!

Thursday, January 25th, 2018, 12:40:58 AM IST

ద్రావిడ్ లా ఆదుకుంటాడనుకుంటే.. ద్రావిడ్ ఆడినట్లు ఆడాడు. తొలిపరుగు తీయడానికి 50 కి పైగా బంతులని తినేశాడు. ఈ ఉపోద్ఘాతం అభినవ ద్రావిడ్ చటేశ్వర్ పుజారా గురించే. టీం ఇండియా కష్టాలో ఉన్న సమయం లో ది వాల్ లాగా ప్రత్యర్థులకు అడ్డుగా నిలిచేవాడు ద్రావిడ్. అడ్డు గోడలా నిలవడమే కాదు భారత ఇన్నింగ్స్ అని అందంగా నిర్మించే వాడు కూడా. కానీ పుజారా ఆ సంగతి మరిచాడో ఏమో కానీ వాల్ లాగా ఆలాగే నిలబడిపోవడానికి ప్రయత్నించాడు. పుజారా ఖాతా తెరవడానికి ఏకంగా 54 బంతులు అవసరమయ్యాయి.

తాను ఎదుర్కొన్న 54 వ బంతిని సింగిల్ గా మలచి పుజారా తొలి పరుగు సాధించాడు. దీనితో డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న సహచరులు ముఖాల్లో నవ్వుల పువ్వులు విరిశాయి. ఆతర్వాత పుజారా కాస్త వేగంగా ఆడాడు. ఇన్నింగ్స్ మొత్తం మీద 179 బంతులని ఎదుర్కొన్న పుజారా 8 బౌండరీలతో 50 పరుగులు సాధించి అవుట్ అయ్యాడు. అర్థశతకం సాధించినా ఈ ఇన్నింగ్స్ భారత జట్టుని ఆదుకోలేకపోయింది. విరాట్ కోహ్లీ కూడా అర్థ శతకం సాధించి ఔట్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికా టూర్ లో చెత్త ప్రదర్శనని చేస్తున్న భారత బ్యాట్స్ మాన్ మూడవ టెస్టు లోని అదే ధోరణి అవలంభిస్తున్నారు. వాండరర్స్ మైదానం లో జరుగుతున్న మూడవ టెస్టులో భారత జట్టు 187 పరుగులకే కుప్పకూలింది. ఇదే పరిస్థితి కొనసాగితే టీం ఇండియా కు వైట్ వాష్ తప్పదు.