బాబు ఒప్పుకున్నాడు..నువ్వు కూడా ఒప్పేసుకో జగన్..!

Wednesday, January 24th, 2018, 03:50:09 AM IST

బిజెపి, వైసీపీ మధ్య పొత్తు ప్రయత్నాలు బలంగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష నేత జగన్ బిజెపి పట్ల సానుకూలమైన వ్యాఖ్యలు చేస్తుండడంతో ఆ పార్టీలో జోష్ పెరిగింది. తెరవెనుక చంద్రబాబు కు హ్యాండ్ ఇచ్చి జగన్ పంచన చేరడానికి ఢిల్లీ లెవెల్ లో భారీ కసరత్తు జరుగుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ఏపీలో సోము వీర్రాజు, పురేందేశ్వరి వంటి నేతల మొదలుకుని అమిత్ షా వరకు దీని గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నారట. సోము వీర్రాజు డైరెక్ట్ గానే చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారు. గతంలో వెంకయ్య నాయుడు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న సమయంలో చంద్రబాబు అనుకూల వర్గ ప్రభావం ఏపీ బీజేపీలో ఎక్కువగా ఉండేది. కానీ వెంకయ్య ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయిపోయారు.

దీనితో బాబు వ్యతిరేక వర్గం ఆలోచనలకు రెక్కలు వచ్చాయి. ప్రత్యేక హోదా ఇస్తే బిజెపితో తాను పొత్తుకు సిద్ధం అని జగన్ తేల్చేశారు. ఈ నేపథ్యంలో బిజెపి నేతలంతా జగన్ ని బుజ్జగించే పనిలో ఉన్నారట. ఎలాంటి కండిషన్లు లేకుండా పొత్తుకు ముందుకు రావాలని జగన్ ని కోరుతున్నట్లు తెలుస్తోంది. మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి జగన్ కు ఇదేరకమైన అప్పీల్ చేసారు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ బావుంటుందని ఈ విషయాన్ని చంద్రబాబు సైతం అంగీకరించారని అన్నారు. జగన్ కూడా ప్రత్యేక హోదా గురించి మరళా మాట్లాడడం భావ్యం కాదని తెలిపారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ఆమె మరో మారు నొక్కి ప్రస్తావించారు.