టీడీపీలోకి పురందేశ్వరి..!?

Sunday, September 14th, 2014, 12:35:00 PM IST


రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరంటారు.ఆ మాటను బీజేపీ నేత పురంధేశ్వరి మరోసారి రుజువు చేయబోతున్నారా..? ఆమె మరోసారి పార్టీ మారబోతున్నారా..? శత్రువుగా భావించే మరిదితోనే మళ్లీ చేతులు కలపబోతున్నారా..? తండ్రి స్థాపించిన తెలుగుదేశంలోకి పురంధేశ్వరి చేరబోతున్నారా అంటే.. సమాధానం అవును అనే వినిపిస్తోంది.

చిన్నమ్మ త్వరలో తెలుగుదేశంలో చేరవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. ఆ మాట ఆమే స్వయంగా చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న పురంధేశ్వరి దంపతులు.. అక్కడ ఎన్ఆర్ఐ లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలుగుదేశంలోకి వచ్చేందుకు తాము సానుకూలమేనని చెప్పారు.

టీడీపీలో చేరేందుకు దగ్గుబాటి పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావులు సిద్ధమేనని ప్రకటించారు. అయితే, సమయం అనుకూలించాలని చెప్పారు. లాస్ ఏంజిల్స్‌లో శనివారం ప్రవాసాంధ్రులతో నిర్వహించిన సమావేశంలో కలిసి పాల్గొని తమ మనసులోని మాట బయటపెట్టారు. గత పదేళ్లుగా కాంగ్రెసు పార్టీలో ఉన్న మీరు ఇప్పుడు బీజేపీలోకి వచ్చారు.. మరి టీడీపీలోకి ఎప్పుడు వస్తారని ప్రశ్నించారు. దానిపై ఆమె స్పందించారు. తాము కూడా దీనికి సానుకూలంగానే ఉన్నామని, పరిణామాలు ఇందుకు అనుకూలించాలని వారు చెప్పారు.

ఎన్టీఆర్ సంతానంలో దగ్గుబాటి పురంధేశ్వరికి ప్రత్యేకత ఉంది. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చినా.. స్వల్పకాలంలోనే తన సమర్థత నిరూపించుకున్నారు. తండ్రి జీవితాంతం వ్యతిరేకించిన పార్టీలో చేరినా.. తండ్రి ఆశయసాధన కోసమే ఇదంతా అని చెప్పుకొచ్చారు. ఎంపీగా ఎన్నికైన తొలిసారే మన్మోహన్ సింగ్ కేబినెట్లో స్థానం సంపాదించుకున్నారు. అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారని పేరు తెచ్చుకున్నారు. భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు చంద్రబాబుతో ఉన్న విభేదాల దృష్ట్యా.. ఆమె, చంద్రబాబు ఎప్పుడూ ఉప్పు-నిప్పులాగానే ఉంటూ వచ్చారు. మరి పురంధేశ్వరి చంద్రబాబు సయోధ్య ఎలా ఉండబోతుందో చూడాలి.