సైనాతో సై అంటున్న సింధు..!

Monday, August 12th, 2013, 05:34:10 PM IST

saina-sindu
ప్రపంచ చాంపియన్‌షిప్ లో కాంస్య పతకం సాధించిన సింధూ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఉరకలెత్తే ఉత్సాహంతో ఉన్న సింధు తన జోరు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది. త్వరలో జరిగే ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ సహచర క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో సమరానికి సై అంటోంది. ”నా తదుపరి లక్ష్యం ఐబీఎల్‌లో సత్తాచాటడం. ఇందులో మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు నా శక్తిమేర ప్రయత్నిస్తా. భారత నంబర్‌వన్ సైనాతో పోరుకు నేను రెడీగా ఉన్నాను” అని తెలుగు సంచలనం సింధు తెలిపింది. సైనా హైదరాబాద్ తరఫున, సింధు లక్నో ఫ్రాంచైజీ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఈ ఇద్దరి మధ్య ఈ నెల 15న మ్యాచ్ జరగనుంది. దీంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

15 లక్షల నగదు బహుమతి
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన సింధుకు భారత బ్యాడ్మింటన్ సంఘం రూ.15 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. చైనాలో సింధు చూపించిన తెగువ ప్రశంసనీయమని.. అందుకే ఆమెకు 15 లక్షల నజరానాను ప్రకటిపస్తున్నట్టు బాయ్ తెలిపింది. అంతర్జాతీయ సర్క్యూట్‌లో మంచి ఫలితాలను సాధించిన ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ముందుంటామని బాయ్ అధ్యక్షుడు అశిలేష్ దాస్ గుప్తా తెలిపాడు.