మదర్ సెంటిమెంట్ తో మోడీ కి రాహుల్ షాకింగ్ కౌంటర్!

Thursday, May 10th, 2018, 06:30:56 PM IST


ప్రస్తుతం జరగనున్న కర్ణాటక ఎన్నికల సందర్భంగా అక్కడి పర్యటనల్లో వున్న యుపిఎ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే మొన్న ప్రధాని అవ్వాలని తనకి ఉందని, కానీ కాంగ్రెస్ కి పూర్వ వైభవం వస్తే అందరి ఆమోదంతో తాను ఆ పదవి చేపడతానని రాహుల్ చెప్పారు. ఈ విషయమై మోడీ మాట్లాడుతూ, ప్రధాని పదవి చేపట్టాలన్న రాహుల్ కోరిక అహంకారపూరితమైనదని అన్నారు. దానికి ప్రతిగా రాహుల్ స్పందిస్తూ, మీ పార్టీలో సీనియర్ నాయకులైన అద్వానీని పక్కన పెట్టి ప్రధాని కుర్చీయే ఎక్కిన మీరా ఈ మాటలు చెప్పేది అని గట్టి రిటార్ట్ ఇచ్చారు. ఇక తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఉద్దేశించి మోడీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

ఆమె ఇక్కడివారు కాదు, ఇటలీ దేశస్థురాలు అనే విషయాన్నీ మర్చిపోకూడదని విమర్శించారు. అయితే నేడు మోడీ మాటలకు విరుచుకుపడ్డ రాహుల్ మాట్లాడుతూ, తన తల్లి ఇటలీ దేశస్థురాలు అనే మాట నిజమేనని, అయితే ఆవిడ తన జీవితంలో ఎక్కువ భాగం భారతదేశంలోనే గడిపారన్న విషయాన్నీ గుర్తు చేశారు. అంతేకాదు పేరుకు మాత్రం భారతీయులమని చాలామంది చెప్పుకుంటారని, అటువంటి వారికంటే తన తల్లి చాలా గొప్పదని రాహుల్ మండిపడ్డారు. ఈ దేశంకోసం ఆమె చేసిన త్యాగాలు, పడిన కష్టాలు దేశ ప్రజలందరికీ తెలుసు అన్నారు. ప్రధాని హోదాలో వున్న మోడీ స్థాయి ఏమిటో ఆయన వ్యాఖ్యలే చెపుతున్నాయని, ఒకవేళ అలా మాట్లాడడమే ఆయనకు ఇష్టమైతే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

ఈ సందర్భంగా మోడీని ఉద్దేశించి ఒక ఉదాహరణ చెప్పారు. ఒక కోపిష్టి బుద్ధుడిని నానావిధాలుగా తిడుతుంటే ఆయన మౌనం వహించారట. కొందరు శిష్యులు స్వామి అతడు మిమ్ములను ఆవిధంగా దూషిస్తుంటే ఎందుకు మాట్లాడకుండా మౌనం వహించారు అని అడిగారట. దానికి గౌతమ బుద్ధుడు బదులిస్తూ, అతడు నాకు ఆగ్రహాన్ని బహుమతిగా ఇచ్చాడు. కానీ నాకు దాని అవసరం లేదని చెప్పారట. తనతో ఎప్పటికైనా ప్రమాదముందని మోడీకి కోపమని, కానీ ఆయనంటే తనకు మాత్రం కోపం లేదని, కోపం అనేది ఆయనకే సమస్యని తనకు మాత్రం కాదని తెలివిగా బదులిచ్చారు…….