జాగ్రత్తగా ఉండండి.. తెలంగాణ నేతలకు రాహుల్ హెచ్చరికలు!

Saturday, September 15th, 2018, 08:59:32 AM IST

ఎలక్షన్స్ వచ్చాయంటే ఇతర పార్టీల వారు విమర్శలు చేయడం కామన్. దాని వల్ల ఎలాంటి నష్టం ఉండకపోవచ్చు గాని సొంత పార్టీలో ఉండే నేతలే బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీకి తీరని నష్టాన్ని మిగులుస్తుంది. అలాంటి పరిస్థితులు వస్తే ఎలాంటి పార్టీకైనా ఎలక్షన్స్ ఎంతో కొంత దెబ్బ తప్పదనే చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో అలాంటి పరిస్థితులే ఎక్కువగా నెలకొన్నాయి. సొంత పార్టీలోని నేతలే ప్రస్తుతం రాజకీయాలపై అసహనం వ్యక్తం చేస్తుండడం అధిష్టానానికి మింగుడుపడటం లేదు.

గతంలో ఎప్పుడు లేని విధంగా నేతల మధ్య ఐక్యత తగ్గిందని ఆరోపణలు వస్తున్నాయి. ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో నేతల మధ్య టికెట్ల విషయంలో చాలా భిన్నాభిప్రాయాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల జరిపిన సమావేశంలో నేతలకు గట్టిగా హెచ్చరించారట. ఎవరికీ వారు ఇష్టానుసారంగా మీడియా ముందుకు వెళ్లి విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ఏమైనా సమస్యలు ఉంటే రాష్ట్ర అధ్యక్షుడితో చర్చించాలని లేదంటే తనతో డైరెక్ట్ గా మాట్లాడాలని సూచించారు. తప్పకుండా అందరికి అందుబాటులో ఉంటానని రాహుల్ హామీ ఇచ్చారు. అదే విధంగా ఎలక్షన్స్ లో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలంగాణ వచ్చింది కాంగ్రెస్ వల్లే అని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నేతలకు వివరించారు.

ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిపై కూడా ఎవరు ఎలాంటి విమర్శలు చేయకూడదని అన్నారు. ఇష్టానుసారంగా మాట జారితే వేటు తప్పదని అందరి నేతలకు రాహుల్ వార్నింగ్ ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా ఉండి పార్టీని గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. అలాగే త్వరలో తెలంగాణాలో సోనియా గాంధీతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తే బావుంటుందని నేతలు కోరగా అందుకు రాహుల్ ఒకే చేప్పారు. ఇకపోతే పొత్తుల విషయం గురించి చర్చిస్తూ.. గెలిచే స్థానాలను ఏ మాత్రం వదులుకోకూడదని మహాకూటమిలో సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని తెలిపారు. గతంలో పొత్తుల విషయంలో ఏర్పడిన పరిస్థితులు మళ్లీ రిపీట్ కాకూడదని చెబుతూ.. అభ్యర్థులు పార్టీని గెలిపించే దిశగా కష్టపడాలని రాహుల్ గాంధీ సలహాలు ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments