ట్రైన్ తో కికి ఛాలెంజ్.. ఉహించని శిక్ష వేసిన కోర్టు!

Thursday, August 9th, 2018, 07:41:08 PM IST

సోషల్ మీడియాలో వెక్కిలి చేష్టలు చేసినట్టు కనిపిస్తే న్యాయస్థానాలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన విషయాల్లో కావాలని తలదూరిస్తే కఠిన శిక్షలు అమలుపర్చడానికి కూడా వెనుకాడడం లేదు. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వార్నింగ్ లు ఇస్తూనే ఉన్నారు. ఇక రీసెంట్ గా కికి ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు నోటీసులు పంపుతున్నారు. అయితే ఆ విషయాన్నీ లెక్క చేయని ముగ్గురు యువకులు ఏకంగా రైలు దగ్గర కికి ఛాలెంజ్ చేసి ఊహించని శిక్షకు అర్హులయ్యారు.

మహారాష్ట్రలోని విరార్‌ ప్రాంతంలో నిషాంత్‌ షా(20), ధ్రువ్‌ షా(23), శ్యాం శర్మ(24) అనే ముగ్గురు యువకులు కదులుతున్న ట్రైన్ నుంచి దిగి కికి పేరిట వెక్కిలి వేషాలు వేసి అందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ వెంటనే ముగ్గురుని అరెస్టు చేశారు. గతంలో అంబులెన్స్‌ దగ్గర కూడా ఈ యువకులు కికి ఛాలెంజ్‌ చేసినట్లు పోలీసులు వీడియోలను రైల్వే కోర్టుకు అందించారు. దీంతో న్యాయస్థానం వారికి ఊహించని శిక్షలు వేసింది.

ఆగ్రహించిన కోర్టు విసాయ్‌ రైల్వే స్టేషన్‌ను శుభ్రం చేయాలనీ ఆ ముగ్గురికి శిక్ష వేసింది. అలాగే ప్రజలకు ఇలాంటి విన్యాసాలు చేస్తే ప్రమాదానికి గురవుతారని అవగాహనా కల్పించాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటల నుంచి 2 గంటలకు అలాగే 3 గంటల నుంచి 5 గంటల వరకు ఇచ్చిన పనులను పూర్తి చేయాలనీ, అలాగే వారు చేసే పనులను వీడియో తీసి కోర్టుకు సమర్పించాలని రైల్వే పోలీసులను ఆదేశించారు. అనంతరం ఇంకా ఏదైనా శిక్షా వేయాలా లేదా అనే విషయాన్నీ తెలుపుతామని న్యాయమూర్తి వివరణ ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments