రైల్వే వెబ్‌సైట్‌ ఐఆర్‌సీటీసీ దారుణ మోసం!!

Wednesday, October 10th, 2018, 12:01:08 AM IST

ద‌స‌రా, సంక్రాంతి వేళ ఇంటికెళ్లేందుకు రైల్ టిక్కెట్ బుక్ చేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. ఆగి ఆలోచించండి. ముఖ్యంగా రైల్ వెబ్ సైట్ల‌ను అస్స‌లు న‌మ్మొద్దు. అక్క‌డ మీకు న‌ర‌కం త‌ప్ప‌దు. రైలు ప్ర‌యాణం చేయాల‌నుకుంటే ఎవ‌రైనా టిక్కెట్టు బుక్ చేసుకోవాల్సిందే. ఆ టిక్కెట్టు కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళితే అక్క‌డ చుక్క‌లు క‌నిపిస్తున్నాయ్‌. కంచే చేను మేసిన చందంగా ఈ వెబ్ సైట్ జ‌నాల సొమ్ముల్ని మేసేస్తోంది. టిక్కెట్టు బుక్ చేసుకోవ‌డానికి సైట్‌లోకి వెళ్లి ఆ ప్రాసెస్ అంతా న‌డిపించ‌డానికి గంట‌ల కొద్దీ స‌మ‌యం వెచ్చించడ‌మే కాకుండా అక్క‌డ స‌రైన స‌ర‌ళ‌మైన విధానం లేక‌పోవ‌డంతో దారుణంగా డ‌బ్బును న‌ష్ట‌పోవాల్సి వ‌స్తోంది. దీంతో ఆన్‌లైన్‌లో ట్రెయిన్ టిక్కెట్ బుక్ చేయాలంటేనే ఝ‌డుసుకునే ప‌రిస్థితి. ఓవైపు వెబ్ సైట్‌లో ప్రాసెస్ చేస్తుంటే, అందులో ఓటీపీ స‌రిగా రాదు. దానికోసం వేచి చూసి విసిగిపోవాల్సిందే. ఓటీపీ వ‌చ్చింది స‌రే అని కాస్త ఆల‌స్యంగా దానిని ఎంట‌ర్ చేస్తే బ్యాంక్ అకౌంట్ నుంచి డ‌బ్బు క‌ట్ అవుతుంది త‌ప్ప అస‌లు టిక్కెట్ బుక్ అవ్వ‌డం అన్న‌దే ఉండ‌దు. క‌నీసం లాగిన్ అయిన‌ ఈమెయిల్‌కి మెసేజ్ కూడా రాదు. అంత పెద్ద వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భుత్వం ఎంత నిర్ల‌క్ష్యంగా మెయింటెయిన్ చేస్తుందో తెలుసుకుంటే క‌ళ్లు భైర్లు క‌మ్మేస్తాయి.

ఈ టార్చ‌ర్ మామూలు టార్చ‌ర్ కాద‌ని ఐఆర్‌సీటీసీని ఫాలో చేసేవారికి ఇట్టే అర్థమైపోతోంది. దీనంత నీచ‌మైన వ్య‌వ‌స్థ ఇంకొక‌టి లేనేలేద‌ని ప్రాక్టిక‌ల్‌గా ప్రూవ్ అవుతోంది. ఇక ఇందులో క‌ప్చా ఎంట‌ర్ చేయ‌మ‌ని ఓ ఆప్ష‌న్ వ‌స్తుంటుంది ప్ర‌తిసారీ. అది ఎంట‌ర్ చేసినా వెంట‌నే ఓకే కాదు. అయితే ఇంత దారుణ‌మైన ప‌రిస్థితి ఒక‌ప్పుడు ఉండేది కాదు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఫీచ‌ర్స్ పెంచి, అక్క‌డ ర‌క‌ర‌కాల యాడ్లు- వాటి ప్ర‌మోష‌న్ కోసం వింత వేషం మొద‌లు పెట్ట‌డంతో త‌ల‌నొప్పి స్టార్ట‌యింది. సైట్ లుక్ మార్చాక కొత్త తిప్ప‌లు మొద‌ల‌య్యాయి. ఇక‌ ఒక‌సారి ఖాతాలో ఉన్న డ‌బ్బు అంతా క‌ట్ అయ్యాక‌.. టిక్కెట్టు ఖాయ‌మైన‌ట్టు మెసేజ్ రాదు స‌రిక‌దా.. నెక్ట్స్ టికెట్ బుక్ చేసుకోవాలో లేదో కూడా క‌న్ఫామ్ చేసుకోలేని దారుణ ప‌రిస్థితి. టెక్నాల‌జీతో స‌దుపాయం మెరుగ‌వుతుంద‌నుకుంటే ఇది ఎంత దారుణం? నిత్యం కోట్లాది మంది వీక్షించే ఓ వెబ్ సైట్ ఇంత నిర్ల‌క్ష్యంగా ఉంటుందా? ఇదేనా మ‌న భార‌త‌దేశ దౌర్భాగ్యం అనుకునే ప‌రిస్థితి నెల‌కొంది.

ఇదివ‌ర‌కూ ఈ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసిన ద‌గుల్బాజీలు కొంద‌రు గంప‌గుత్త‌గా టిక్కెట్ల‌ను బ్లాక్ చేసి వాటిని బ్లాక్‌లో అమ్మేసుకునేవారు. ఆ త‌ర్వాత ఆ చైన్ గ్యాంగ్‌ని ప‌ట్టుకుని జైల్లో వేశారు. అయినా ఈ వెబ్ సైట్‌ని న‌మ్మ‌డానికి లేకుండా పోయింది. ఇందులో క‌ప్చా సిస్ట‌మ్ స‌రిగా ఉండ‌దు. ఓటీపీ సిస్ట‌మ్ అలానే ఉంటుంది. మ‌రి ఇలాంట‌ప్పుడు ఎలా న‌మ్మేది?

బ్యాంకులు దారుణం:
ఐఆర్‌సీటీసీ లాంటి చోట టిక్కెట్టు బుక్ చేసేప్పుడు కొన్ని బ్యాంకుల ఓటీపీ వ్య‌వ‌హారం అంతే అప‌స‌వ్యంగా ఉండ‌డం దారుణం. యాక్సిస్ బ్యాంక్ లాంటి వ్య‌వ‌స్థ‌తోనూ చాలానే త‌ల‌నొప్పులు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఉప‌యోగించి ట్రాన్జాక్ష‌న్ చేయాల‌నుకున్నా, స‌ద‌రు బ్యాంకుకు సంబంధించి ఓటీపీ రావ‌డం కూడా అంతే దారుణ‌మైన అనుభ‌వాన్ని ఇస్తుంటుంది. ఆన్‌లైన్ ఓపెన్ అయ్యాక టికెట్ బుకింగ్ ప్రాసెస్ లైవ్‌లో ఉండ‌గా వోటీపీ కోసం మినిమం పావుగంట అయినా వేచి చూడాల్సి వ‌స్తుంటుంది. ఐదు నిమిషాల్లో అయినా ఓటీపీ రాన‌ప్పుడు కాస్త కంగారుగా ఓటీపీ రీసెండ్ కొడితే రెండు వోటీపీ నంబ‌ర్లు వ‌చ్చేస్తాయి. ఇదంతా ఓ పెద్ద క‌న్ఫ్యూజ‌న్ వ్య‌వ‌హారంగా మారిపోతుంది. దాని వ‌ల్ల డ‌బ్బును క‌స్ట‌మ‌ర్ కోల్పోవాల్సి ఉంటుంది. ఇక అలా క‌ట్ అయిన మొత్తం తిరిగి అకౌంట్‌కి బ‌ద‌లాయిస్తామ‌ని రైల్వేస్, బ్యాంకులు చెబుతుంటాయి. కానీ ఆ బ‌దలాయింపు ఎప్ప‌టికి జ‌రుగుతుందో చెప్ప‌లేని స‌న్నివేశం ఉంది. మొత్తానికి ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ మొత్తం లోప‌భూయిష్టం అని దీనిని బ‌ట్టి ప్రూవ్ అవుతోంది. తెలుసు క‌దా.. అని బుక్ చేశారో బుక్క‌యిపోయారే!