బెట్టింగ్ లకు పాల్పడ్డ రాజస్థాన్ రాయల్స్ టీం ఓనర్ రాజ్ కుంద్ర

Thursday, June 6th, 2013, 02:53:04 PM IST


ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్ళు, ఐపిఎల్ చైర్మెన్, పలువురు హీరోయిన్స్, బాలీవుడ్ నటులు ఇలా పలువురి పేర్లు వినిపించాయి, వారందరినీ ముంబై పోలీసులు దాదాపు విచారణ కూడా చేసారు. తాజాగా ఈ స్పాట్ ఫిక్సింగ్ కేసు మరో మలుపు తీసుకుంది. మొదటగా స్పాట్ ఫిక్సింగ్ లో దొరికింది రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ళు. స్పాట్ ఫిక్సింగ్ కేసు లోతుగా విచారణ జరిగేటప్పటికి ఈ టీం కో ఓనర్, బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త అయిన రాజ్ కుంద్ర కూడా బెట్టింగ్ లకు పాల్పడ్డాడని తేలింది. ఆయన గత 2 – 3 సంవత్సరాలు బెట్టింగ్ లో పాలు పంచుకుంటున్నాడని తేలింది.

రాజస్థాన్ రాయల్ టీం నుండి సాప్ట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టైన సిద్దార్థ్ త్రివేది అప్రూవల్ గా మారి పోలీసు విచారణలో ‘ అహ్మదాబాద్ లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు రాజ్ కుంద్ర బిజినెస్ పార్టనర్ ఉమేష్ వచ్చి తనని కలిసాడని’ చెప్పడంతో పోలీసులు రాజ్ కుంద్రని సుమారు 10 గంటల పాటు విచారించారు.

ఢిల్లీ పోలీస్ చీఫ్ నీరజ్ కుమార్ మాట్లాడుతూ ‘ తన టీం నష్టాల్లో ఉండడం వల్ల రాజ్ కుంద్ర బెట్టింగ్ లకు పాల్పడ్డాడని, అతని పార్టనర్ ఉమేష్ గోయెంకా ఇవన్నీ చేసాడని’ తెలిపారు. ‘ఇప్పుడు రాజ్ కుంద్ర కూడా మా విచారణలో ఓ భాగం కావున అతని దేశం దాటి వెళ్లకూడదని అతని పాస్ పోర్ట్ తీసేసుకున్నాం. ఇప్పటివరకూ చేసిన విచారణ ప్రకారం రాజ్ బెట్టింగ్ లలో ఇన్వాల్వ్ అయ్యాడు కానీ అతనికి స్పాట్ ఫిక్సింగ్ కి సంబంధం ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. కానీ ఈ ఘటన వల్ల కేసు పక్క దోవ పట్టదు. స్పాట్ ఫిక్సింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న క్రైమ్ సిండికేట్స్ ని వదిలి పెట్టేది లేదని’ ఢిల్లీ పోలీసులు తెలిపారు.

మరో వైపు రాజ్ కుంద్ర భార్య శిల్పా శెట్టి మాత్రం నిజా నిజాలు తెలియకుండా, ఆధారాలు లేకుండా ఎలా పడితే అలా ప్రచురించవద్దని మీడియా వారిపై ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తానికి మొదట ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్ళతో మొదలైన ఈ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇంకా ఎంతమందికి భాగస్వామ్యం ఉందో, ఈ కేసు ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి.