తమిళ రాజకీయాల్లో రజనీ మేనియా..!

Wednesday, November 14th, 2018, 10:49:37 PM IST

ప్రస్తుతం తమిళ నాట రాజకీయాలు సూపర్ స్టార్ రజనీకాంత్ చుట్టూ తిరుగుతున్నాయి. గతేడాది డిసెంబర్ 31న రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి తన రాజకీయ రంగ ప్రవేశం పై ఓ క్లారిటీ ఇచ్చాడు తలైవా, అయితే అప్పటి నుండి పార్టీని ప్రారంభించకుండా మరోవైపు చకచకా సినిమాలు పూర్తి చేసుకుంటూ పోతున్నాడు. ఆయన ఎటువైపు అడుగులు వేస్తారా అని తమిళనాడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇప్పటికే రజని రాజకీయ రంగప్రవేశం మీద బారి అంచనాలు నెలకొన్నాయి. రాష్ట్రంలో బలంగా ఉన్న డీఎంకే, అన్నాడీయంకే పార్టీలలో ఆందోళన మొదలైంది.

శబరిమల, కావేరి నీటి అంశం వంటి అంశాల పై రజని చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్రంలోని పార్టీలు పలు రకాలుగా స్పందించాయి. రజని రాక కోసం ప్రాంతీయ పార్టీలతో పాటు, జాతీయ పార్టీలు కూడా ఎదురు చూశాయి, కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు ఆయనను బహిరంగంగానే పార్టీలోకి ఆహ్వానించాయి. అయితే అయన పార్టీ ప్రారంభం మీద ఇంకా స్పష్టత రాలేదు.,దీంతో డిసెంబర్ 12న రజని పుట్టినరోజు సందర్బంగా పార్టీ గురించి ప్రకటన ఉంటుందని, అభిమానులు, రాష్ట్ర ప్రజలు, ఇతర రాష్ట్ర నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్టీ ప్రారంభానికి ముందు ఆయన ఎవరితో కలిసి అడుగేస్తారన్న అంశం కీలకంగా మారింది. రాజకీయ ప్రవేశం గురించి ప్రకటించినప్పటి నుండి రజని కాషాయ పార్టీకి దగ్గర ఉంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆ మధ్య ప్రధాని మోడీ స్వయంగా రజని నివాసానికి వెళ్లటంతో ఆ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళసై సౌందరాజన్ 2019 ఎన్నికల తర్వాత రజినీకాంత పార్టీ పూర్తి మద్దతు ఉండబోతుంది అని బహిరంగంగా ప్రకటించటం ఇందుకు బలం చేకూరుస్తుంది.

గత యాభై ఏళ్లుగా తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఐదేళ్లకోసారి అధికారాన్ని బదలాయించే ఆనవాయితీ తమిళ ఓటర్లు ఫాలో అవుతున్నారు. అయితే గత ఎన్నికల్లో జయలలిత ఆ ఆనవాయితీకి గండి కొట్టింది. కరుణానిధి, జయలలిత లాంటి బలమైన నాయకుల మరణం తర్వాత రాష్ట్రంలో దృఢమైన నాయకత్వ కొరత ఏర్పడింది. రాజకీయ ప్రవేశ ప్రకటన రోజున 234 స్థానాల్లో పోటీ చేయబోతున్నాం అని పరకటించటంతో, డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయంగా రజని ఒక్కడే కనిపిస్తున్నాడు. తాను డబ్బు, పదవి మీద వ్యామోహంతో రాజకీయాల్లోకి రావట్లేదని, బ్రష్టు పట్టిన రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు, ప్రజల కోరిక మేరకు రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్టు తెలిపారు. తానూ సరైన నిర్ణయం తీసుకోకపోతే ప్రజలకు ద్రోహం చేసినవాడిని అవుతానని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా అని అన్నారు. ప్రస్తుతం రజని పార్టీ ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఆయన పార్టీ ప్రారంభించే రోజుకోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.