ర‌జ‌నీ పార్టీ ప్ర‌క‌ట‌న ఇంకెప్పుడు?

Tuesday, September 25th, 2018, 07:43:57 PM IST

త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు అంత‌కంత‌కు వేడెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల నాట‌కీయ ప‌రిణామాల న‌డుమ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్‌హాస‌న్ రాజ‌కీయ పార్టీలు ప్రారంభిస్తున్నామంటూ వేడి పెంచారు. అయితే ఆ ఇద్ద‌రు స్నేహితుల్లో క‌మ‌ల్ హాస‌న్ ఇప్ప‌టికే `మ‌క్క‌ల్ నీది మ‌య్యం` పార్టీ ప్రారంభించి ప్ర‌జ‌ల్లోకి వేగంగా దూసుకెళ్లిపోయారు. అయితే పార్టీ పెడుతున్నా.. ఇదిగో వ‌చ్చేస్తున్నాం! అంటూ ప్ర‌క‌టించిన ర‌జ‌నీ మాత్రం ఇంత‌కాలం అస‌లు పార్టీ మాటే ఎత్త‌లేదు. ఇప్ప‌టికీ దీనిపై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. పార్టీకి సంబంధించిన కార్య‌క‌లాపాలు, సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా అభిమానుల్ని, కార్య‌క‌ర్త‌ల్ని పోగేస్తున్నా పార్టీ ప్ర‌క‌ట‌నే పెండింగులో ఉండిపోయింది. అయితే ఈ స‌స్పెన్స్‌కి తెర‌దించేందుకు ర‌జ‌నీ రెడీ అవుతున్నార‌న్న‌ది తాజా వార్త‌.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కేవ‌లం ఏడెనిమిది నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే మిగిలి ఉండ‌గా, ఈపాటికే ర‌జ‌నీ పార్టీ ప్రారంభించి ప్ర‌చార హోరులోకి దిగాల్సింది. కానీ ఇంకా ఆయ‌న సినిమాలు చేస్తూ బిజీగా ఉండ‌డంతో త‌న‌నే న‌మ్ముకున్న‌వారంతా ఖంగుతినాల్సి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీపై అంత‌కంత‌కు ఒత్తిడి పెరుగుతూనే ఉంది. ఇక ఆ ప్ర‌క‌ట‌న డిసెంబ‌ర్‌లో ఉంటుంద‌ని ర‌జ‌నీ స‌న్నిహితుడు కమ్ పుదియనీతి కట్చి వ్యవస్థాపకుడు ఏసీ షణ్ముగం ప్ర‌క‌టించ‌డంతో మ‌రోసారి ఆ సంగ‌తి హాట్ టాపిక్ అయ్యింది. అంటే ఇంకో 60రోజుల త‌ర్వాత‌ ర‌జ‌నీ పార్టీ ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని అభిమానులు ఫిక్స‌యిపోతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ర‌జ‌నీ పార్టీ పోటీ చేయ‌డం ఖాయం, వారితో క‌లిసి ముందుకు వెళ‌తామ‌ని ష‌న్ముగం ప్ర‌క‌టించారు. ర‌జ‌నీ పార్టీ పెట్టే విష‌యంలో ఎలాంటి సందేహాలు లేవ‌ని ఆయ‌న బ‌లంగా చెప్ప‌డంతో అంద‌రిలో న‌మ్మ‌కం పెరిగింది. అయితే ర‌జ‌నీ కేవ‌లం ఈ ఎనిమిది నెల‌ల్లోనే పార్టీ పెట్టి, ప్ర‌చారం చేసి సీఎం అయిపోతారా? అంటూ సందేహాలు నెల‌కొన్నాయి. ఉన్న‌ది చాలా త‌క్కువ స‌మ‌యం. ప్ర‌త్య‌ర్థుల కుయుక్తుల న‌డుమ ర‌జ‌నీ హ‌వా న‌డుస్తుందా? అన్న‌ది కాస్తంత డౌట్‌ఫుల్‌. మ‌రోవైపు ర‌జ‌నీకాంత్ మాత్రం వురుస‌గా రెండు సినిమాల‌కు సంత‌కాలు చేసి, మురుగ‌దాస్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్‌ని క్యూలో పెట్ట‌డం చూస్తుంటే ఆయ‌న వాల‌కం ఏంటా? అన్న సందేహాలు క‌న్ఫ్యూజ్ చేస్తున్నాయి. డిసెంబ‌ర్ వ‌ర‌కూ వేచి చూస్తే కానీ ఏదీ క్లారిటీ రాదేమో?