సీఎం.. రజినీకాంత్..!

Saturday, February 18th, 2017, 02:02:50 PM IST


దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత అరవ రాజకీయాల్లో అలసిపోని సంక్షోభం నెలకొంది.పన్నీర్ వర్గం, శశికళ వర్గం మధ్య పోటాపోటీతో అదికాస్తా తార స్థాయికి చేరుకుంది. దీనితో తమిళ రాజకీయాల్లో రాజకీయ సూన్యత కచ్చితంగా ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.రాజకీయంగా ఏర్పడిన ఆ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారు అనే అభిప్రాయం వినిపిస్తోంది. తమిళ రాజకీయాలను రాబోవు రోజుల్లో శాసించేది ఎవరంటూ వస్తున్న ప్రశ్నకు మొదట వినిపించే సమాధానం.. తలైవా. అవును.. తమిళనాడు వ్యాప్తంగా ఈ డిమాండ్ ఊపందుకుంటోంది. రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సిన సమయం ఇదేమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఆయన అభిమానులైతే చెన్నై వ్యాప్తంగా తరువాతి ”ముఖ్యమంత్రి రజినీ అయితే ఉత్తమం” అని రాసి ఉన్న పోస్టర్ లు దర్శనమిస్తున్నాయి. రజిని రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్ ఇప్పటిది కాదు. 1996 లో ” ఈ సారికూడా అన్నా డీఎంకే అధికారంలోకి వస్తే తమిళనాడు రాష్ట్రాన్ని దేవుడు కూడా రక్షించలేడు” అని రజినీ వ్యాఖ్యానించారు. తమిళ రాజకీయాల్లోకి రజినీ ఎంట్రీ ఖాయమన్న అభిప్రాయం అప్పుడే మొదలైంది. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. దీనికి కారణం తమిళ రాజకీయాల్లో చోటు చేసుకున్న సంక్షోభమే. అభిమానులు తలైవా రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నా రజిని మాత్రం ఈ విషయం పై ఎప్పటికప్పుడు దాటవేస్తున్నారు.రజిని రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఎంత బలంగా ఉందొ చెప్పడానికి నిదర్శనం ఈ పోస్టర్లే.మరోవైపు రజిని రాజకీయాల్లోకి తీసుకురావాలని బిజెపి గట్టిగా ప్రయత్నిస్తోందనే వాదన వినిపిస్తోంది.