రజినీకాంత్ ముఖ్యమంత్రి అవడం ఖాయం : ప్రముఖ కమెడియన్

Tuesday, May 22nd, 2018, 01:20:24 PM IST

తమిళనాట 2019లో జరగనున్న ఎన్నికలు ఎంతో ఉత్కంఠతతో సాగనున్నాయి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. అమ్మ జయలలిత మరణంతో ప్రజలకు ఒక దిశా నిర్దేశం చేసే నేత ఎవరూ లేకపోవడంతో అక్కడి ప్రజలు సరైన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకే, అలానే స్టాలిన్ నేతృత్వంలోని డిఎమ్ కె పార్టీలు రెండూ కూడా రానున్న ఎన్నికల్లో అధికారం కోసం తహతహ లాడుతున్నాయి. అయితే వున్నట్లుండి అనూహ్యంగా అక్కడి సూపర్ స్టార్లు రజినీకాంత్, కమల్ హాసన్ లు ఇరువురు విడివిడిగా పార్టీలు నెలకొల్పుతుండడంతో ఆ రెండు పార్టీలకు గొంతులో వెలక్కాయ పడ్డట్లయింది. ఇప్పటికే కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పేరుతో పార్టీని నెలకొల్పి కొద్దిరోజుల క్రితం ప్రజల్లోకి వెళ్లి యాత్రలు కూడా చేసారు.

ఇక రజిని కూడా తన పార్టీ ప్రారంభానికి గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. ఆయన తన పార్టీకి సంబంధించిన పలు శాఖలతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ ప్రకటన మరియు ఇతరత్రా కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రజిని మక్కల్ మండ్రం పేరిట ఒక దళాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాగా తిరువళ్లూరు ఆర్ ఎమ్ ఎమ్ కార్యాలయం నిన్న ప్రారంభమయింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన ప్రముఖ హాస్యనటుడు జీవా, రజిని రాజకీయ భవితవ్యం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రానున్న ఎన్నికల్లో రజిని ముఖ్యమంత్రి అవడం ఖాయమని, అలానే రానున్న ఐదేళ్ల తరువాత అయన ప్రధాన మంత్రి కూడా అవుతారని వ్యాఖ్యానించారు.

రజిని మక్కల్ మండ్రం లక్ష్యం రెండు కోట్ల మంది సభ్యులను చేర్చడమే కాదని ఐదున్నర కోట్ల మంది ప్రజల ఓట్లు సంపాదించడం కూడా అని అన్నారు. కాగా రజిని 150కి పై గా నియోజకవర్గాల్లో గెలుపొందే అవకాశం ఉందని ఇటీవల ఒక కథనం ప్రచురితమైన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. దీన్ని బట్టి చూస్తే రజని ప్రభంజనం ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రజలు రజిని రాకతో వ్యవస్థలో మార్పు వస్తుందని ఆశిస్తున్నారని అన్నారు. పేద, మధ్యతరగతి, బడుగు వర్గాల వారి విద్య, ఉపాధిపై ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అందరికి సమాన న్యాయం కల్పించడం, అట్టడుగు వర్గాలవారికి కూడా అన్ని రకాల సంక్షేమపథకాలు చేరేలా రజిని మక్కల్ మండ్రం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు……

  •  
  •  
  •  
  •  

Comments