రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ షురూ..కొత్త పార్టీనా.. బీజేపీలోకా..?

Friday, February 10th, 2017, 05:32:56 PM IST


సూపర్ స్టార్ రజినీకాంత రాజీకీయ రంగ ప్రవేశం చేయడానికి జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. ఎప్పటినుంచో రజిని పొలిటికల్ ఎంట్రీపై అనేక ఊహాగానాలు వెలువడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభం దృష్ట్యా తాను రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయం అని రజినీకాంత్ భావిస్తున్నారట. ఈమేరకు అయన ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంత కర్త గురుమూర్తితో భేటీ అయ్యారు. గురుమూర్తి , మరియు తన ఇతర సన్నిహితులతో రాజకీయ రంగ ప్రవేశం పై చర్చిస్తున్నారని తెలిసింది. పొలిటికల్ ఎంట్రీకి సిద్దంగానే ఉన్నా కొత్త పార్టీ పెట్టాలా లేక బిజెపి లో చేరాలా అనే విషయాలపై ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రజిని తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన చేస్తే అది సంచలనమే అవుతుంది. ఇప్పటికే రజిని కాంత్ కు రాజకీయ పార్టీల నుంచి అనేక ఆహ్వానాలు అందాయి. 2014 ఎన్నికల సమయం లో ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ స్వయంగా రజిని ఇంటికి వెళ్లారు. ఆయన రజినీకాంత్ ని బీజీపీ లోకి ఆహ్వానించినట్లు కూడా ప్రచారం ఉంది. కాగా ప్రస్తుతం అన్నా డీఎంఏకే పార్టీ లో శశికళ, పన్నీర్ సెల్వం లమధ్య విభేదాలతో తమిళనాడులో రాజకీయ అనిశ్చితి నెలకొని ఉంది. తాజాగా రజినీకాంత్ రాజకీయ చర్చలు ప్రారంభించడంతో తమిళ రాజకీయాలు అత్యంత ఆసక్తిని కలిగిస్తున్నాయి.