రామ్ చరణ్ ‘తుఫాన్’కు ఉద్యమ సెగ

Friday, September 6th, 2013, 10:54:29 AM IST

thoofan-movie

ఈ రోజు విడుదలైన రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ జంజీర్ (తెలుగులో తుఫాన్)కు సమైక్య సెగ తాకింది. సమైక్యాంధ్ర విషయంపై చిరంజీవి వైఖరిని నిరసిస్తూ పవన్ కల్యాణ్, చరణ్ సినిమాలను అడ్డుకుంటామని గతంలోనే ప్రకటించిన సమైక్యవాదులు.. చెప్పినట్టుగానే ఈ రోజు విడుదలైన ‘తుఫాన్’ చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటున్నారు.

శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నర్సాపురం, ఏలూరు, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఉదయాన్నే థియేటర్ల వద్దకు చేరుకున్న సమైక్యవాదులు చిత్ర ప్రదర్శనను అడ్డుకుని, పోస్టర్లు చించివేశారు. చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు థియేటర్ల యజమానులు కూడా చిత్రాన్ని ప్రదర్శించేందుకు జంకుతున్నారు.

తుఫాన్ కు సీమాంధ్ర, తెలంగాణల్లో విభిన్న కోణాల్లో ఉద్యమ సెగ తగులుతోంది. తుఫాన్ చిత్రాన్ని సీమాంధ్రలో సమైక్యవాదులు అడ్డుకుంటుంటే, చిరంజీవి సమైక్యవాదంటూ సినిమాను ఆడనివ్వబోమంటు తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు.

సమైక్య జేఏసీ హెచ్చరికలతో చిత్ర నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ హైకోర్టును ఆశ్రయించి రక్షణ కల్పించాలని కోరింది. దీంతో.. భద్రత కల్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. అయినా.. సమైక్యవాదులు బెనిఫిట్ షోను అడ్డుకున్నారు. ఇదే పరిస్థితి మిగిలిన షోలకూ కొనసాగితే.. తుఫాన్ నిర్మాతలతో పాటు బయ్యర్లకు భారీ నష్టాలు కలుగుతాయి. సినిమాకు మొదటి రెండు వారాలే కీలకం కాబట్టి.. పరిస్థితి ఎలా ఉంటుందోనని అంతా ఎదురుచూస్తున్నారు.